03/01/2023
*శిక్ష అనుభవించాల్సిందే....*
కురు పాండవుల మధ్య పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధాను యోధులంతా వీర మరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెతాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది..
‘కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు... వీరిని కూడా విడిచి పెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా. వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే... అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది..’’ అంటూ ప్రశ్నించింది.
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. ‘‘వారు చేసిన పాపం ఏమిటి’’ రెట్టించింది.. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు..‘‘నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ. వారు జీవితమంతా నిజమే చెప్పారు.. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు’...
‘‘ఏం తప్పు చేశారు?’’... ‘‘పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే., పెదవి విప్పకుండా, తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి, హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా.. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకుమించిన నేరమేముంది...’’...
‘‘మరి కర్ణుడి సంగతి ఏంటి., ఆయన దానకర్ణుడన్న పేరు సంపాదించాడుగా.. గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా.. ఆయనను కూడా అన్యాయంగా చంపించావే యుద్ధంలో. నువ్వు మరీ ఇంత నిర్దయుడివా’’...
‘నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే, యుద్ధరంగంలో యోధాను యోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు... మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి పక్కనే ఉన్న కర్ణుడిని మంచినీళ్లు అడిగాడు. కర్ణుడి పక్కనే మంచినీటి చెలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదన్నాడు. అలా కర్ణుడు అభిమన్యుడి దాహం తీర్చలేదు.
ఆ తరవాత కర్ణుడి రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో.., ఏ ఒక్క తప్పు చేసినా, జీవితాంతం చేసిన మంచి కనుమరుగై పోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు.
ఇదే కర్మ సిద్ధాంతం... చేసే పని నీతిమంతమైనదేనా, న్యాయమైనదేనా, అని ఆలోచించాలి’’ అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు..
*కృష్ణం వందే జగద్గురుం.*