30/09/2024
*ఇరుగుపొరుగు రాష్ట్రాలను చూసైనా ఏపీ నేర్చుకోవాలి*
అమరావతి: ఇరుగుపొరుగు చూసి సంసారం నేర్చుకోవాలి అన్న చందంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలను చూసి ఏపీ చాలా నేర్చుకోవాలి అని ఏపీ ఫార్మసిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సింగనమల సుమన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో ఫార్మసీ వృత్తి నిపుణుల ఖాళీల భర్తీలను శాశ్వత ప్రాతిపదికన నియామకం చేయకుండా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం చేస్తూ గత దశాబ్దాల కాలంగా ఏపీ ప్రభుత్వాలు ఫార్మసిస్టుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని, ఇప్పటికైనా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాలను చూసిసైనా ఫార్మసిస్టుల నియామకాలపై ఏపీ ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యపు మొండి వైఖరినిమార్చుకోవాలంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఫార్మసిస్టులు వైద్య ఆరోగ్య రంగ వృత్తి నిపుణులని, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టడానికి మరే ఇతర కేటగిరీ కిందికి రారని ఏపీ ప్రభుత్వం, పరిపాలన అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల రిపోర్టులను, వాటి సిఫార్సులను బట్టి ఆసుపత్రులలో పడకల దామాషి ప్రకారం ఫార్మసిస్టులను, మెడికల్ షాపుల సంఖ్య దామాష ప్రకారం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నియామకం చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో ఖాళీలు దశాబ్దలకాలంగా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే ఫార్మసిస్టుల నియామక ప్రకటన విడుదల చేసి శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం వలె పోటీ పరీక్షల ద్వారా ఫార్మసిస్టు గ్రేడ్ 2, డ్రగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ మరియు క్లినికల్ ఫార్మసిస్టుల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
అమరావతి: ఇరుగుపొరుగు చూసి సంసారం నేర్చుకోవాలి అన్న చందంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలను చూసి ఏపీ చాలా నేర్చుకోవాలి ....