15/06/2018
దేవుడిచ్చిన పండు దానిమ్మ
డా. జి వి పూర్ణచందు
“హరి నఖర భిన్న మత్త మాతంగ కుంభ రక్త ముక్తాపల సదృశాని దాడిమీ ఫల” తన ఎర్రని ముక్కుతో ఒక చిలుక దానిమ్మపండుని చీలుస్తున్న దృశ్యం... ‘హరి నఖం’ అంటే ‘సింహం పంజా’తో మత్తగజ కుంభస్థలాన్ని చీలుస్తున్నట్టుందిట. దాని కుంభ స్థలం మీంచి కారే రక్తంతో తడిసిన ముత్యాలహారం లోని ఎర్రని ముత్యాల్లా దానిమ్మగింజ లున్నాయంటాడో కవి.
“ఎండి పళ్లెంలోనా ఎన్నపూసెట్టీ దానిమ్మ రసంలో జలకమాడిన వయ్యారి” గురించి భువనచంద్ర ఒక పాట రాశాడు. వెన్న రాసుకుని దానిమ్మరసం పట్టిస్తే చర్మం మృదువుగా నిగనిగలాడుతుంది. అదీ దానిమ్మ రసంలో జలకమాడితే లాభం.
‘దాడకం’ అనే సంస్కృత పదానికి దంతాల వరుస అని అర్థం. సంస్కృతంలో ‘దాఢ’ అంటే కోరపన్ను, పళ్ల సమూహం అని రెండర్థాలు ఉన్నాయి. దంతాల ఆకారంలోని గింజల సమూహం అనే అర్థంలో సంస్కృతంలో దానిమ్మని ‘దాడిమః’ అని పిలిచారు. ఇది కొద్దిగా పులుపు రుచితో కూడుకున్నది కాబట్టి, తెలుగులొ ‘దాడినిమ్మ’ అన్నారు. అది జనవ్యవహారంలో దానిమ్మ అయ్యింది. గట్టి బెరడు కలిగింది కాబట్టి ‘కరక’ అని కూడా పిలుస్తారు. కరక్కాయ కూడా ఈ అర్థంలోనే ఏర్పడింది. హిందీలో ‘అనార్ అనీ, ఇంగ్లీషులో పోమెగ్రనేట్ అనీ పిలుస్తారు. ‘గ్రైన్స్’ అంటే గింజలు. దానిమ్మ పండులో విడిగా గుజ్జు అనేది లేకుండా కేవలం గింజలు మాత్రమే ఉంటాయి కాబట్టి, గింజల పండు అనే అర్థంలో ‘పోమెగ్రెనేట్’ అని పిలుస్తారు. ఈ పదం ఫ్రెంచి నుండి పాత ఇంగ్లీషులోకి వచ్చిందంటారు.
దానిమ్మ చరిత్ర
అనార్కలి కథలో దానిమ్మ(అనార్) ‘ప్రేమ’కు ప్రతిబింబం. పాశ్చాత్య సాహిత్యంలోనూ ప్రేమకు సంకేతంగా దానిమ్మ పండుని వర్ణించారు. 3,500 యేళ్ళ క్రితమే దానిమ్మను ప్రేమ సంకేతంగా చిత్రిస్తూ, సాల్మన్‘రాజు దేవాలయంలో కొన్ని కుడ్య చిత్రాల్లో దానిమ్మలూ ఉన్నాయి. దానిమ్మ పండు ఆకారంలో సాల్మన్ రాజు కిరీటం ఉండేదిట. హిబ్రూ బైబులు ‘సాల్మన్ పాట’ ప్రకరణంలో మానవుల ప్రేమబంధాన్ని సూచిస్తూ దానిమ్మని ప్రస్తావిస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్లకు ఎర్రదానిమ్మ పవిత్ర ఫలం. ఫారోలు(పితృదేవతలు) తిన్న పండు అని వారి నమ్మకం. వాళ్ల సమాధుల్లో దానిమ్మ పండ్ల చిత్రాలు ఉన్నాయట. ”టుట్’ అనే ఈజిప్షియన్ రాజు సమాధిలో ఆయనతో పాటు దానిమ్మ పండ్లున్న బుట్టకూడా ఉంది.
దానిమ్మ పండ్లు తింటే అద్భుతశక్తులు సిద్ధిస్తాయని, గ్రీకుల రతీదేవి అఫ్రొడైట్‘కి ఇష్టమైన ఫలం అనీ, లైంగిక శక్తిని
ద్విగుణం బహుళం చేస్తుందనీ ప్రాచీన గ్రీకుల నమ్మకం. జొరాష్ట్రియనిజం ప్రకారం దానిమ్మ అనంత జీవితానికి సంకేతం. ప్రాచీన
ఇటలీ రాణి ”ఎలియోనోరా డి తొలెడో’ కట్టుకునే బట్టల మీద దానిమ్మపండ్ల బొమ్మలు ఉండేవిట. ఏడుగురు సంతానానికి తల్లి ఆమె. మాతృత్వానికి చిహ్నంగా ఆమె ఈ ‘దానిమ్మ చీర’ కట్టుకునేదిట.
క్రీస్తుకు స్వాగతం చెప్పేందుకు క్రిష్టమస్ రావటానికి ముందు దానిమ్మ పండుని గుమ్మానికి వ్రేలాడదీస్తారట. తెలుగు వాళ్లు బూడిదగుమ్మడి కాయని వ్రేలాడదీయటంలో ‘దిష్టి’ ఒక్కటే కాదు, ఇలా దేవతలకు స్వాగతం పలకటం కూడా అంతరార్థం ఉంది. ఎందుకంటే కూష్మాండం దేవతా ఫలమేగానీ, దెయ్యం పండు కాదు. కొన్ని ప్రాంతాల్లో డిసెంబరు 31 అర్థరాత్రి 12గంటలకు దానిమ్మ పండుని ఇంటి సింహద్వారం మండిగానికి తగిలేలా గట్టిగా విసిరి కొడతారు. ఎన్ని గింజలు ఇంట్లోకి ఎగిరిపడితే అంత శుభంట! వివాహాది శుభకార్యాల్లో కూడా దానిమ్మని పగల గొట్టే ఆచారం ఉన్నదట, దానిమ్మ గింజలు ఇల్లంతా చిందితే ఆ ఇల్లు పుత్ర పౌత్రాభివృద్ధితో కళకళలాడుతుందని! తెలుగు వాళ్లు ఎర్రగుమ్మడి కాయనీ ఇలానే పగలకొడతారు.
హిందువులు గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్టు చర్చికి దానిమ్మ పండ్లను తీసుకువెళ్లే వాళ్లూ ఉన్నారు. రోమియో జూలియట్లు కిటికీకి ఇవతల గదిలో పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నారు! కిటికీకి అవతల దానిమ్మచెట్టు మీద కూర్చుని దానిమ్మపండు తింటోంది పక్షి... ఈ రెండింటినీ ఒక సింబాలిజంగా చిత్రిస్తాడు షేక్‘స్పియర్.
ఔషధంగా దానిమ్మ
దానిమ్మ మొదట ఇరానులో పుట్టిందనీ, మొగలాయీల కాలంలో ఇండియాకి వచ్చిందనీ, ఇండియా నుండే ఇతర దేశాలకు వెళ్లిందనీ చెప్తారు. కానీ, ఇది నిజం కాదు. చరక సుశ్రుతాది వైద్య ప్రముఖులు దానిమ్మ గురించి అనేక వైద్య ప్రయోజనాల్ని వివరించారు. కాబట్టి, ఇది భారతదేశానికి ప్రాచీన ఫలమేననీ, మధ్యయుగాల్లో వచ్చింది కాదనీ తెలుస్తోంది.
దానిమ్మగింజలు పులుపు, వగరు తీపి రుచుల్ని కలిసి ఉంటాయి. వీటిలో స్నిగ్ధత ఉంటుది. ఇవి ఉష్ణవీర్యం కలిగినవి. వాంతి, వికారాలను తగ్గిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. వాతాన్ని పోగొడతాయి. విరేచనాల నాపుతాయి. కఫాన్ని, పిత్తాన్ని పోగొడతాయి. వగరు రుచి వలన వాతం, పుల్లని రసం వలన వేడి పెరగాలి. కానీ, తీపి రుచి వలన ఈ దోషాలు అదుపులో ఉంటాయి. అందుకే, చరకుడు పుల్లదానిమ్మ పెద్దగా వేడి చెయ్యదన్నాడు. వగరు రుచి షుగరు రోగులకు అపకారం చేయదు.
ఎసిడిటిని, షుగరుని, దప్పికనీ, వేడినీ, జ్వరాన్ని తగ్గిస్తుంది. గుండె, గొంతు, ముఖ వ్యాధుల్లో మేలుచేస్తుంది. జీర్ణకోశాన్ని బలసంపన్నం చేస్తుంది. రుచిని పెంచుతుంది. వాతాన్ని, కఫాన్ని వేడినీ తగ్గిస్తుంది. పొడిదగ్గు తగ్గిస్తుంది. ఐస్ ముక్కల్లేకుండా తాజా పండ్లరసాన్ని తాగితే మేలు చేస్తుంది.
రోగకారక జీవాణువుల్ని నాశనం చేసే వృక్షసంబంధమైన రసాయనాలను ఫైటోకెమికల్స్ అంటారు. దానిమ్మరసంలో 100కి పైగా ఫైటో కెమికల్స్ ఉన్నాయి. మన శరీరం నిరంతరం వ్యాధికారిక సూక్ష్మజీవులతో పోరాడుతూనే ఉంటుంది. ఇందుకు కణజాలాల లోపల అందుబాటులోఉండే అస్త్రశస్త్రాల్ని యాంటీ ఆక్సిడెంట్లు అంటారు. ఇవి ఆరోగ్యవంతమైన
శరీరకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. దానిమ్మ గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
కేన్సర్ వ్యాధిని తగ్గించే ఉత్తమ ఫలం ఏదంటే ఠక్కున దానిమ్మ పేరు చెప్పాలి. యాబైలు దాటిన పురుషులు తరచూ దానిమ్మ తింటూంటే ప్రోస్టేట్ కేన్సర్ రాకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిమ్మరసంలో తగింత మిరియాలపొడి, పసుపు కలుపుకుని తాగితే కేన్సర్ వచ్చే పరిస్థితులు శాంతిస్తాయి.
ఆల్జిమర్స్ అనే మతిమరుపువ్యాధి ఉన్నవారికి దానిమ్మ గింజల్ని తరచూ పెడుతూ ఉంటే ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు దానిమ్మ గింజలు తెలివితేటలు పెరిగేందుకు తోడ్పడతాయి. పరిక్షల సమయంలో నైటౌట్లు చేసే పిల్లలకు రాత్రి చదువుకునేప్పుడు దానిమ్మగింజలు పెడితే కడుపులో యాసిడ్ పెరక్కుండా ఉంటుంది. చదివింది ఙ్ఞాపకం ఉంటుంది.
జూన్ 2013 మెడికల్ న్యూస్ టుడే పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో డయాలిసిస్ మీద ఉన్నరోగికి దానిమ్మ రసం ఇవ్వాలని వ్రాసింది. వాపును, విషదోషాలను పోగొడుతుంది కాబట్టి, ఇది మూత్రపిండాల మీద వత్తిడిని తగ్గిస్తుందంటున్నారు.
దానిమ్మ పండులో రోజువారీగా మనకు కావాల్సిన సి విటమిన్‘లో 40% దొరుకుతుంది. అదృష్టవశాత్తూ మనవాళ్ళు జామ, దానిమ్మ, బొప్పాయి, ద్రాక్ష, బత్తాయి లాంటి పండ్లను ఉడికించకుండా నేరుగా తినే అలవాటు ఉన్నవారు కాబట్టి, వాటి ద్వారా సి విటమిన్ దక్కుతుంది. టమోటాలో ఎంత ఎక్కువ సి విటమిన్ ఉన్నా దాన్ని వండుతున్నాం కాబట్టి, అందులోని ‘సి’ విటమిన్ మనకు దక్కకుండా పోతోంది. సి విటమిన్ కలిగిన వాటిని వండకుండా తింటే మేలు చేస్తాయి.
వండి పొయ్యి మీంచి దింపిన తరువాత ఆహారపదార్థాల్లో దానిమ్మ గింజల్ని పులుపు కోసం కలుపుకోవచ్చని చరకుడు అనుమతిచ్చాడు. పెరుగన్నం లోనూ, సాంబారు అన్నం లోనూ, రోటి పచ్చళ్లలోనూ కూర-పప్పుల్లో కూడా దానిమ్మగింజల్ని చేర్చి తింటే చింతపండు లేకుండా ఆహార పదార్థాలను పుల్లగా తినటానికి వీలౌతుంది. పేగుపూత, కీళ్లవాతం, షుగరు, బీపీ ఉన్నవారు కూడా ఇలా చింతపండుకు బదులుగా దానిమ్మగింజలు కలిసిన ఆహార పదార్థాలు తినవచ్చు.
దానిమ్మకాయల్ని పగలకొట్టకుండా ఎండిస్తారు. ఎండిన దానిమ్మకాయిని దంచి, ఇంకా ఏడు ఇతర మూలుకలను కలిపి‘దాడిమాష్టక చూర్ణం’ తయారు చేస్తారు. ఇది ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖమైంది. పేగుపూత, అమీబియాసిస్, కలరా, నీళ్లవిరేచనాలు, కడుపులో గడ్దలు వీటిమీద పనిచేస్తుంది. దాడిమాష్టక చూర్ణానికి జీర్ణకోశ వ్యాధులన్నింటి పైన ప్రభావం ఉంది. ఎసిడిటీని తగ్గించటానికి ఇది గొప్ప ఔషధం. మొలల వ్యాధిలో కూడా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మూత్రపిండాల రోగులకు, షుగరు రోగులకు, బీపీ రోగులకు, గుండె జబ్బులున్నవారికి షుగరు రోగులకు ఏ మందులు వాడ్తున్న వారైనా సరే అదనంగా ఈ దాడిమాష్టక చూర్ణాన్ని రోజూ రెండు పూటలా అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే ఈ ప్రయోజనాలన్నీ నెరవేరతాయి. వాడుతున్న మందులు బాగా పనిచేస్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో రక్తంతో కూడిన జిగురు పడ్తున్నప్పుడు, తాజాగా దానిమ్మ గింజలు, దానిమ్మ రసం అందిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దానిమ్మగింజల్ని పెరుగులో కలిపి తినే అలవాటు వలన పేగులు శుభ్రపడతాయి. ఇప్పుడు చెప్పుకున్న జీర్ణకోశవ్యాధులు, ముఖ్యంగా అమీబియాసిసి, పేగుపూత వ్యాధుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఉదయం గానీ, రాత్రిగానీ టిఫిన్లకు బదులుగా వారంలో రెండు మూడు సార్లయినా దానిమ్మగింజలు, పెరుగు మిశ్రమాన్ని తినేవారికి పేగులు దృఢంగా ఉంటాయి. అజీర్తి కారణంగా పుట్టే వాత వ్యాధులన్నీ ఉపశమిస్తాయి.
దానిమ్మ చెట్టు బెరడు, పూలు, లేత చిగుళ్లు, దానిమ్మ పిందెలు, దానిమ్మకాయమీద బెరడు వీటికీ అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది. వాటిని ఎండించి మెత్తగా దంచిన పొడిని పాలు కలపకుండా టీ కాచుకు తాగవచ్చు. ఈ పొడితో పళ్లు తోముకుంటే చిగుళ్లు దృఢంగా ఉంటాయి. పళ్లలోంచి నెత్తురు కారటం ఆగుతుంది. దానిమ్మ వేళ్ళను దంచిన పొడిని పావు చెంచామోతాదులో కొన్ని రోజులపాటు రెండు పూటలా తీసుకుంటే, కడుపులో పురుగులు పడిపోతాయి. బద్దెపురుగు లేదా నాడాపురుగు (టేప్ వరమ్) మీద దీనికి ఎక్కువ ప్రభావం ఉంది.
చివరిగా ఒక మాట
రాజుగారొకాయన దారి తప్పి అలిసిపోయి, దప్పికతో బాధపడుతూ ఓ దానిమ్మతోట దగ్గర ఆగాడు. ఆయనే రాజని తెలియక పోయినా తోటమాలి దానిమ్మరసం తీసిచ్చాడు. దాహం, అలసట తీరాక ఆ రాజు “దానిమ్మ పళ్ళతో నందనవనంలా ఉంద ఈ తోటని స్వాధీనం చేసుకోవాలి!” అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ, ఇంకొంచెం పళ్లరసం కావాలని అడిగాడు. తోటమాలి మరో పెద్ద దానిమ్మ పండు కోసి పిండబోతే ఆశ్చర్యంగా చుక్కరసం కూడా రాలేదు. ఎన్నికాయలు కోసినా రసం రావట్లేదు. ఎందుకిలా జరుగుతోందని అడిగాడు రాజు.
“అయ్యా! దానిమ్మ పండు దేవఫలం. రాజ్యాన్ని పాలించే రాజు సహృదయతో పాలిస్తే దానిమ్మలు తియ్యరసాలు స్రవిస్తాయి. మొదటి సారి దానిమ్మను పిండినప్పుడు రాజు మంచి మనసుతోనే ఉన్నాడు. ఇంతలోనే రాజుగారికి ఏదో దుర్బుద్ధి పుట్టినట్టుంది. అందుకే, దానిమ్మలు తమ రసాలను ఉపసంహరించుకున్నాయి” అన్నాడు తోటమాలి.
రాజేకాదు, ప్రజలూ మానవతా పరిథుల్ని దాటకూడదు!