01/12/2025
భారతీయులకి బహు ముఖ్యంగా, రెండిటి మీద అమితమైన ప్రీతీ..
ఒకటి కడుపు నిండా తినే భోజనం,
రెండోది మనస్సు నిండా జరుపుకునే వివాహం!
ఒకటి కడుపుని నింపితే, రెండోది జీవితాన్ని నింపుతుంది!
అందుకే, అంబరాలంటే అట్టహాసాలకి,
వివాహాలు అమాయకంగా లొంగిపోతుంటాయి!
ఎన్నో అట్టహాసాల వివాహాలు చూసిన నాకు,
మొన్నీమధ్య మా ఇంటి ముందు జరిగిన
ప్రశాంతపు వాతావరణంలో జరిగిన ఒక పరిణయం,
నన్ను మంత్రముగ్ధుడిని చేసింది..!
నా గురువు, మిత్రుడు, ఆప్తుడు అయిన మా బావ వరప్రసాద్ రెడ్డి గారి మనవరాలి పెళ్లి!
సాంప్రదాయ బద్ధంగా, గుడిలో పెళ్లి చేసుకోవాలనే
ఉన్నతమైన కోరిక కోరిన తన మనవరాలికి,
తన కళా తృష్ణ తోడై,
ఓ కాళాత్మక అద్భుతం ఆవిష్కరించబడింది!
సనాతనంగా వచ్చే గుడులని,
అంతే ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా,
పునః సృష్టించి..చక్కటి పచ్చదనాన్ని నింపి,
సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా
కళ్యాణ మండపాన్ని, ఆ పరిసరాల్ని అలంకరించారు..!
చెప్పులు విప్పి ఆ వివాహ వేడుకకి వెళ్లాలేమో అనేంత
పవిత్రతని మోసేలా ప్రతి అణువు, ఎంతో ఆలోచనతో,
అనురక్తితో,త్రికరణ శుద్ధితో,
పెళ్లి ఏర్పాట్లు చేశారు..!
ఇక భోజనం గురించే చెప్పే పని ఏముంది..
ఓ రకంగా మాయాబజార్ లో, రంగా రావు గారిలా,
‘వివాహ భోజనంబు..’ అంటూ అభినందించేలా,
‘ఆహా..! అద్భుతః..!’ అనిపించారు..!
వంట రుచి కొంతైతే, వడ్డించే ప్రేమ బహు రుచి అన్నట్టు,
వరప్రసాద్ రెడ్డిగారి ఆతిధ్యం, అందరిని ఎంతో తృప్తి పరిచింది!
ఇలాంటి పెళ్లిలో, ఇలాంటి అనుభవాలతో పాటు,
మనస్సుని నింపే ఆప్తుల సమ్మేళనాలు జరుగుతుంటాయి..!
అందులో నాలాంటి ‘మనుష్యుల’పిచ్చోళ్ళకి,
అంత మంది ఆప్తులు కనిపిస్తే,
పంచభక్షపరువణ్నాళ్లలాంటి భోజనం దొరికినట్టే..
ఇష్టమైన స్నేహితులు, మృణాళిని-భార్గవిలని కలవడం
ఎంతో ఆనందాన్ని ఇస్తే,
పూజ్యులైన చాగంటి కోటేశ్వర్ రావు గారితో సమయం గడపడం,
ఓ రకంగా అదృష్టమని చెప్పుకోవచ్చు..!
దేవాలయాన్ని పెళ్లి వాకిట తెచ్చి,
దేవుళ్ళు సైతం తొంగి చూసేలా, అట్టహాసంగా పెళ్లి జరిపి,
ఆత్మీయులందరిని ఒక చోట చేర్చి,
మనస్సు నిండా మాటలు, కడుపు నిండా భోజనం పెట్టి,
వధూవరులకే కాక, విచ్చేసిన వాళ్లకి కూడా
జ్ఞాపకంగా మిగిలిపోయేలా పెళ్లిని జరిపించిన
వరప్రసాద్ రెడ్డి గారికి వినమ్రతతో కూడిన అభినందనలు!
ఎంతైనా ఓ మంచి జంటని చూసినప్పుడు,
ఓ చక్కటి పెళ్లి జరిగినప్పుడు,
ఆనందంతో ఎంతో మంది కళ్ళు తడిసినప్పుడు,
ఉద్వేగంతో ఓ కీలక ఘట్టం జీవితాన్ని మారుస్తునప్పుడు,
సంబరంగా ఆ వేదిక తళతళలాడుతున్నప్పుడు,
మనస్సెందుకో తెలియకుండా నిండిపోతుంది,
కనపడకుండా నవ్వుతుంటుంది..
ఆ అనుభవాన్ని రమిస్తూ.. ఇలా పంచుకుంటూ ఉంటుంది.. గురవా రెడ్డి!