19/11/2024
*చికెన్ పాక్స్ / ఆటలమ్మ: ‘అమ్మవారు* ’
వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు
చలికాలం కాస్త తగ్గగానే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా చిగురించే చెట్లు, పువ్వులు... చెప్పుకోవడానికి వసంతకాలమే అయినా, ఈ ఫిబ్రవరి, మార్చి నెలలంటే పిల్లలకి మరో కొత్తరకం వణుకు మొదలవుతుంది. అదేనండి పరీక్షల కాలం.
అయితే సరిగ్గా ఈ సీజన్(Spring)లోనే వాతావరణంలో రకరకాల వైరస్‌లు విజృంభిస్తాయి. అందులో అతి ముఖ్యమైనది చికెన్ పాక్స్ లేదా అమ్మోరు పోయడం.
వ్యాక్సీన్ కాలం వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పట్టణాల్లో, నగరాల్లో ఈ చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ పెద్దగా కనిపించడం లేదుగానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది. కోవిడ్ వల్ల మూతబడిన బడులతో గత రెండేళ్లలో ఈ సీజన్లో చికెన్ పాక్స్ పెద్దగా చూసింది లేదు. ఈ ఏడాదే మళ్లీ మొదలైందీ సమస్య.
పెద్దవాళ్లకి ఈపాటికి చికెన్ పాక్స్ వచ్చి ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. పిల్లల్లో, అందునా బడికెళ్లే వయసువారిలో, చికెన్ పాక్స్ సంక్రమించే రిస్క్ ఎక్కువ.
బడికెళ్లే పిల్లల్లో రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ప్రత్యేకించి ఈ ఇన్ఫెక్షన్ గురించే మనమెందుకు చర్చించుకోవాలి అంటే...ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అపోహలు దీని చుట్టూ అల్లుకుని ఉన్నాయి మన దేశంలోనే.
కానీ ప్రతి సమస్యనీ, అనారోగ్యాన్నీ కూడా నమ్మిన దైవాలతో ముడిపెట్టి చూడటం సైతం అంతే సాధారణం.
తల్లి పోయడం, అమ్మవారు, అమ్మోరు, ఆటలమ్మ, పెద్దతల్లి, (చిన్నతల్లి అంటే స్ఫోటకం/Small pox) శీతాలమ్మ, మాత....ఇలా రకరకాల పేర్లున్న చికెన్ పాక్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. హెర్పిస్ ఫ్యామిలీకి చెందిన 'వారిసెల్లా' జోస్టర్ దీని పేరు.
ఇంతవరకూ విషయం చదువుకున్నవారికి తెలిసినా, ఇంకా పసుపునీళ్లూ పత్యాలు అని కొన్ని మూఢ నమ్మకాలను పక్కన పెట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ అన్యాయం. ఊరి చివర పెద్దమ్మ తల్లికి కోడిని బలివ్వడం, వాడంతా పసుపు నీళ్లు చల్లటం, ఉపవాసాలు, జాగారాలు....ఇలా ఎన్నో అర్థంపర్థం లేని పనులు చేస్తుంటారు.
కొన్ని ప్రక్రియలైతే రోగంతో బాధపడే వారిని మరింత ఇబ్బంది పెట్టేలా, ఒక్కోసారి లేని ప్రమాదాలు తెచ్చి పెట్టేలా ఉంటాయి. వేపాకులపై పడుకోబెట్టడం, పసిపిల్లలకైనా పాలివ్వకపోవడం, పసుపు, వేపాకు ముద్దలు తినిపించడం, నూనె తాగించడం, పోషకాహారం ఇవ్వకుండా చప్పిడి తిండి పెట్టడం, స్నానం పోయకపోవడం ఇంకా ఎన్నో వింత పోకడలున్నాయి.
*చికెన్ పాక్స్ ఎలా సంక్రమిస్తుంది*
ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ముక్కు, నోటి నుండి వెలువడే తుంపర్ల ద్వారా, శరీరంపై ఉన్న నీటి పొక్కుల స్రావాల ద్వారా పక్కనున్నవారికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఎండి చెక్కుకట్టిన చర్మంవల్ల హాని లేదు.
శరీరంలో ప్రవేశించిన తర్వాత వైరస్ మొదటి 10-20 రోజుల్లో కాలేయం, ప్లీహంలోనూ, ఇంద్రియ గ్యాంగ్లియాన్స్‌లోనూ వృద్ధి చెందుతుంది (Primary viremia). తర్వాత శరీరమంతా వ్యాపించి శ్వాసకోశానికి, చర్మానికి చేరుతుంది(Secondary viremia).
మొదటి దశ పూర్తిగా ఎటువంటి లక్షణాలూ కలిగి ఉండదు. ఈ దశలో రోగివల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందదు.
రెండో దశ 24 - 48 గంటలు ఉండి, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం మొదలైన రెండో - మూడో రోజున ఎర్రటి పొక్కులు ముందుగా మొహం, ఛాతీ, వీపుపై మొదలై రెండు మూడు రోజుల్లో కాళ్లు చేతులకు కూడా వ్యాపిస్తాయి.
పొక్కులు మొదట ఎర్రగా చిన్నగా ఉండి, రెండు మూడు రోజుల్లో నీటి బుడ్లలా మారి మధ్యలో చిన్న గుంట పడుతుంది. నీటి తిత్తి చుట్టూ చర్మం ఎర్రగా కమిలి ఉంటుంది. ఇంగ్లీషులో దీన్ని "పెర్ల్ ఆన్ రోజ్ పెటల్" అని వర్ణిస్తారు. విపరీతమైన దురద కలిగివుంటాయి. కళ్లు, పెదవులు, నోటి లోపల, జననేంద్రియాలపై కూడా ఈ నీటి పొక్కులు వస్తాయి. నోటి పూత, పేగులు పొక్కటం వలన అరుచి, అజీర్తి ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ దద్దుర్లు వచ్చే రెండు రోజుల నుండి (Secondary viremia దశ) దద్దుర్లన్నీ అణిగిపోయి చెక్కు కట్టే వరకు రోగి నుండి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నిడివి దాదాపు పది రోజులు (infective period).
*ఈ సమయంలో* తీసుకోవలసిన జాగ్రత్తలు
1.శరీరం, చర్మం, పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2. జ్వరానికి వైద్యులు సూచించిన మోతాదులో పారాసెటమాల్ వాడవచ్చు.
3. దురదకు కాలమైన్ లోషన్ రాసుకోవచ్చు. వైద్యుల సలహాపై యాంటీ హిస్టమిమ్ మందులు వాడవచ్చు. పిల్లలు మరీ గోకేసుకుంటారు కాబట్టి గోర్లు కత్తిరించి, పలుచని బట్ట చేతులకు చుట్టేయాలి.
4. తేలికగా అరిగే బలవర్థకమైన ఆహారం తినాలి.
5. ఇంట్లో ఒకరికి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, తీవ్ర వ్యాధి కలిగే ప్రమాదం ఉన్నవారు, ఇది వరకు ఈ వ్యాధి రానివారు రోగి దూరంగా ఉండాలి.
6. ప్రమాద లక్షణాలపై కనీస అవగాహన కలిగి ఉండి, సత్వర వైద్యం చేయించాలి
అన్ని వైరల్ ఇన్ఫెక్షన్లూ వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగే ఇది కూడా. వారిసెల్లా ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు జ్వరం, దద్దుర్లకు మించి అపాయకరం కావచ్చు. ఇందులో ప్రధానమైనది వారిసెల్లా న్యుమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు. అరుదుగా లివర్ ఫెయిల్యూర్, మెదడువాపు లాంటి ప్రాణాంతక సమస్యలు కూడా కలగవచ్చు.
ఎవరెవరిలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రమాదకరం?
1. సహజ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు(primary immunodeficiency)
2. నెలల వయస్సు పిల్లలు
3. గర్భిణీ స్త్రీలు (మొదటి నాలుగైదు నెలల్లో చికెన్ పాక్స్ వస్తే పిండంపై దుష్ప్రభావం ఉండొచ్చు)
4. క్యాన్సర్లు, ట్రాన్స్‌ప్లాంట్ వంటి సమస్యలకు చికిత్స పొందుతున్న వారు.
5. HIV రోగులు
6. అరుదుగా పూర్తి ఆరోగ్యవంతులు సైతం.
'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
కాన్పు నొప్పులను తట్టుకొనేందుకు వీఆర్ హెడ్‌సెట్
చికెన్ పాక్స్
ఈ పది రోజుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు?
మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా ఏం చేయకూడదో చూద్దాం.
పూజలు, బలులు, ఉపవాసాలు, జాగారాలు, దిష్టి తీయడం- వీటితో ఫలితం శూన్యం.
పచ్చి వేపాకుపై పడుకోబెట్టడం వల్ల దురద ఎక్కువ అవుతుంది.
రోజుల తరబడి స్నానం పోయకపోతే నీటి బుడ్లలో బ్యాక్టీరియా చేరి మరింత ప్రమాదం అవుతుంది. పసుపు యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది కానీ దురద నుండి ఉపశమనం ఇవ్వదు.
నోటి పూత, పేగులు కూడా పొక్కడం వలన ఏది పడితే అది తినడం మంచిది కాదు. కానీ, మరీ చప్పిడిగా అవసరం లేదు.
నూనె, కారం, మసాలా తగ్గించి తినడం మేలు. పాలు, పెరుగు, తాజా పండ్లు తగినంత నీరు అవసరం. లివర్ పని తీరు సరిగా లేనప్పుడు కొవ్వులు, మాంసకృత్తులు వీలైనంత తగ్గించాలి. అంతే.
పసిపిల్లలకు సైతం తల్లిపాలు తాగించకుండా పోతపాలు పట్టడం, చెవుల్లో, ముక్కుల్లో నూనె చుక్కలు వేయడం, తీర్ధాలు, పసుపు నీళ్లు పట్టడం లాంటివి చేయకూడదు.
వారిసేల్లా న్యుమోనియాతో పిల్లలు ఆయాస పడటం, పక్కటెముకలెగరేయడం లాంటివి గమనిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చండి. కాల్చిన దబ్బనంతో పక్కటెముకలపై వాతలు పెట్టడం లాంటివి గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సర్వసాధారణం. ఇవి అతి ప్రమాదకరం.
ఇంకా, నాటు మందులు, ఆకు పసర్లు లాంటివి తాగించడం వలన లివర్ ఫెయిల్ అయ్యి, రోగి కోమాలోకి పోవడం, మరణించడం లాంటివి జరుగుతాయి.
ప్రత్యేకించి గర్భిణీల్లో
గర్భం తొలి దశల్లో చికెన్ పాక్స్ వస్తే పిండంలో అవకరాలు ఏర్పడే అవకాశం ఉంది. గర్భిణీకి, మొదటి నాలుగు లేదా ఐదు నెలల్లో, దగ్గరవారిలో ఎవరికైనా చికెన్ పాక్స్ వచ్చి ఉంటే తక్షణం డాక్టర్‌ను సంప్రదించండి. సూచించిన వైద్యం తీసుకోండి. గర్భంతో ఉన్నవారు, గర్భం ధరించే అవకాశం ఉన్నవారు వ్యాక్సీన్ తీసుకోకూడదు. ముందు జాగ్రత్తగా యాంటీ వైరల్ మందులు వాడకూడదు.
కాన్పుకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రోజుల ముందు చికెన్ పాక్స్ వచ్చినట్లయితే, తల్లి ద్వారా బిడ్డకు వైరస్ సంబంధిత యాంటీబాడీస్ సంక్రమిస్తాయి. కాబట్టి వ్యాధి వచ్చే అవకాశం తక్కువ.
ప్రసవానికి నాలుగు రోజుల లోపు లేదా రెండు రోజుల తర్వాత తల్లికి పాక్స్ వస్తే, నవజాత శిశువుకు యాక్టివ్ వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందులో ముఖ్యంగా వారిసెల్లా న్యుమోనియా, మెనింజైటిస్ ఇలాంటివి ప్రాణాంతకం. అటువంటి సందర్భాల్లో శిశువుకి VIG వంటి అత్యవసర నివారణ వైద్యాలు చాలా వరకు మేలు చేస్తాయి.
వైద్యం విషయంలో సాధారణ ప్రజల్లో ఉండే రెండు అపోహలు
1. వారిసెల్లా ఇన్ఫెక్షన్లో యాంటీవైరల్ మందులు వాడితే ఆ జబ్బుకు సంబంధిత రోగనిరోధక శక్తి రాదు.ఇది ఏమాత్రం నిజం కాదు. తీవ్ర వ్యాధి వచ్చే వారికి తప్ప సాధారణంగా యాంటీ వైరల్ మందులు (acyclovir) అవసరం లేదు కూడా.
2. వ్యాక్సీన్ ద్వారా కన్నా, చికెన్ పాక్స్ రావడం ద్వారానే మెరుగైన ఆరోగ్య శక్తి వస్తుంది. ఇది కూడా అపోహే. ఒకసారి చికెన్ పాక్స్ వచ్చిన వారికి దాదాపుగా జీవితకాలం ఇమ్యూనిటీ వస్తుంది. ఇది ఒకరకంగా మరి టీకానే మరి. అందుకని రోగం అనుభవించి ఇమ్యూనిటీ తెచ్చుకోవడం కన్నా వ్యాక్సీన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ మేలు కదా. పైగా రిస్క్ లేని పని.
ఈ యువతి తన ముఖంపై 'పీరియడ్స్ బ్లడ్' ఎందుకు రాసుకుంటున్నారు
మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం
వాక్సీన్ గురించి..
అభివృద్ధి చెందిన దేశాల్లో 1990లలోనే వాడకంలోకి వచ్చినా, గత పదేళ్లుగా మనదేశంలో వారిసెల్లా వ్యాక్సీన్ విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. ప్రభుత్వ ఉచిత టీకాల జాబితాలోకి ఇంకా దీన్ని చేర్చక పోయినా, విరివిగా అందుబాటులో ఉంది.
12 - 15 నెలల పిల్లలకు ఈ టీకా ఇప్పించవచ్చు. మరొక డోసు 4 - 6 సంవత్సరాల వయస్సులో ఇప్పించాలి. 6 - 13 సంవత్సరాల వయసు ఉన్నవారికి రెండు డోసులు మూడు నెలల నిడివితో ఇవ్వాలి.
ఆపైన వయస్సు వారికి 4-8 వారాల తేడాతో రెండు డోసులు ఇప్పించాలి.
ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వారికి వ్యాక్సీన్ అవసరం లేదు.
ఇది లైవ్ వ్యాక్సీన్ కాబట్టి కొందరు తీసుకోకూడదు. అది ఎవరనేది, ఏ పరిస్థితుల్లో అనేది వైద్య నిపుణులు నిర్ణయిస్తారు.
చివరగా సర్పి (shingles) గురించి ఒక మాట చెప్పుకోవాలి.
ఏళ్ల తరబడి ఇంద్రియ నాడుల్లో స్తబ్దుగా ఉన్న వారిసెల్లా వైరస్, రోగనిరోధక శక్తి క్షీణించినప్పుడుగానీ, వృద్ధాప్యంలోగానీ ఆ నాడివెంబడి నీటిపొక్కుల్లా వ్యాపిస్తుంది. ఆ భాగమంతా విపరీతమైన మంట, దురద ఉంటుంది. 2-3 వారాలు బాధ పెడుతుంది ఈ సర్పి.
ఈ సమయంలో ఆ నీటి పొక్కుల నుంచి వెలువడే వైరస్ వల్ల ఇతరులకు చికెన్ పాక్స్ రావచ్చు. బొబ్బలు తగ్గిపోయినా మంట-నొప్పి కొన్ని నెలలపాటు బాధ పెడతాయి.
అందుకే, ఇప్పుడు అందుబాటులో ఉన్న వారిసెల్లా వ్యాక్సీన్ పిల్లలకు తప్పకుండా ఇప్పించండి. రోగాన్ని, దీర్ఘకాలిక ఇబ్బందుల్ని నివారించండి. ఒకవేళ చికెన్ పాక్స్ వచ్చినా పైన వివరించిన విధంగా వ్యవహరించండి. మూఢనమ్మకాలకు తావీయకండి.
*We care for your Health*
*డా.V.లక్ష్మీ మాధవన్**
*చతుర్ముఖ క్లినిక్స్ (C.D.C)* *Kovvada* *Turangi* ,Kakinada.& Rameswaram.
*9000 588 535*
82470 78188