06/02/2026
అరవైలు దాటాక, కృష్ణ-రామా అంటూ
బ్రతికేయాలి అంటారు కొందరు,
కానీ, మనవడు-మనవరాలు అంటూ
బ్రతికేయాలి అంటాను నేను!
అంతే కదా, అసలు కన్నా వడ్డీ ముద్దు మరీ..!
వైరాగ్యం వచ్చే వయస్సులో
తిరిగి యవ్వనాన్ని వడ్డిస్తారు మనవళ్లు!
జాగ్రత్త కోసం వాళ్ళ వెనక తీసే పరుగులు,
నవ్వు కోసం వారి ముందు చేసే చేష్టలు,
చందమామని తెస్తామని చూపించే ఆశలు,
కన్నీళ్లు ఆపడానికి కాసే అబద్ధాలు,
తగిలిన దెబ్బకి, భూదేవిని గట్టిగ కొట్టి మోపే నిందలు,
ఇలా ఒకటేంటి, తీరిగ్గా ఆలోచిస్తే,
తిరిగి వయస్సుని ఇచ్చి,
ఈ వయస్సులో మన ఆనందాలకు వీలునామాలు అవుతారు!
అలాంటి మన రక్తాన్ని, ప్రేమని తలచుకుంటుంటే,
కృష్ణుడు-రాముడు కూడా మనతో గొంతు కలుపుతారు!
అందుకే, పనిపెట్టుకొని మరీ నా మనవళ్లతో సమయం గడుపుతుంటాను!
అలాగే, వాళ్ళని నెలకోసారి ఇలా సాయంత్రాలు బయటకి తీసుకొని వెళ్లి
ఇష్టమైనవి కొనిస్తూ, తినిపిస్తూ తరించిపోతుంటాను..
అలా ఒక చక్కటి సాయంత్రం లో,
మనవళ్ళని, మనవరాలిని తీసుకొని AMBమాల్ కి వెళ్లిన జ్ఞాపకం ఇది!
‘తాత’రికం లో వుండే మజా అంతా ఇంత కాదు మరి,
ఓ తరం, కళ్ళ canvas ని నిండా నింపేంత,
నిరంతరం కలతలని కనుమరుగుచేసేంత,
నెరిసిన జుట్టుని, వయస్సుని మరిపించేంత..!
(‘తాత’రికం అనే పదాన్ని coin చేసింది నేనే సుమీ, ఆ పేటెంట్ పూర్తిగా నాకే సొంతం!)