19/03/2024
క్రోధి నామ సంవత్సరం ( 2024 -25) లో మేష రాశి ఫలితాలు : -
క్రోధి నామ సంవత్సరం 09.04.2024 నుండీ 29.03. 2025 వరకు
ఈ రాశి స్త్రీ, పురుషాదులకు భాగ్య, వ్యయాధిపతి గురుడు ధనస్థానములో ఉండుట శని 11వ ఇంట బలీయంగా, రాహువు, కేతువులు వ్యయం, షష్టములందు ఉన్నందువలన అన్నివిధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనం చేయు వారికైనా ధనాదాయం బాగుండును. తమ అమూల్య కార్యముల పట్ల విజయం, వ్యవహార నిపుణత. యోచనాశక్తి, శత్రుమూలకముగా అనర్ధములు, సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్ని పరిష్కారమునకు వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నా, హోదా, గౌరవంగల వ్యక్తులు పరిచయంవల్ల గృహ జీవితానందం మంచి ప్రోత్సాహం కలుగును.
ఏదోవిధంగా ధనము చేతికందును.ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళవలె ఖర్చ గును. చేతిలో సొమ్ము నిలవదు. ఋణాలు చేయవలసి వచ్చును. తీర్ధయాత్రలు చేయుదురు. ఆప్తబంధుమిత్రుల మరణములు కొంత బాధకలిగించును. కర్మలు
కూడా చేయవలసివచ్చును. ఆకస్మికంగా, అనుకోకుండా దూర ప్రయాణములు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండును. గతంలో ఉన్న రోగములు తగ్గును.
సుఖమైన, ఆనందమైనజీవనం అనుభవించెదరు. సంతానంవలనసౌఖ్యం,గృహంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును. స్థలం కొనుట, లేదా గృహం కొనుట తప్పక జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధకార్యములు రెండవ నెల నుండి పూర్తగును. గృహనిర్మాణలాభములు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చును.
గురు,శనులబలం బాగుంది. రాహువువల్ల సూతకాలు పితృ, మాతృ సోదర వర్గ అరిష్టములు కలుగును. జీవితంలో ఔన్నత్యములు కలుగును. అనుకున్నది సాధించ గల తపన పెరుగును. మనోబలంతో కార్యలాభం , జీవనసౌఖ్యము కలుగును.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో వృషభ రాశి ఫలితాలు : -
ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము సంపత్తు కుటుంబ మునకు కారకుడైన గురుడు జన్మంలో కలసినందున సప్తమంలోశని రాజ్యస్థానంలో ఉండుట. ఈగ్రహ సముదాయ బలంచే జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును. అయినా శుభాశుభ ఫలితములేఇచ్చును. సంసారజీవితంలో ఆనందం.|ఉత్సాహప్రోత్సాహములు, మనోనిశ్చితకార్యములు నెరవేరుట జరుగును. స్థిరాస్థిని వృద్ధిచేయుట, భూగృహ జీవితానందము, పదవులు, బహుమానములు పొందుట, అధికారఅనుగ్రహం,స్త్రీమూలకలాభం,అన్యస్త్రీలాభాలు, విలవైనవస్తువులు కొనుట,
కొన్ని విషయాలలో అపనిందలు, అపవాదులు ఎదుర్కొనవలసి వచ్చును. ఆకస్మిక నిర్ణయాలువల్ల బుద్ధిచాంచల్యం తేజోనాశనం. ఇతరులు వలన మోసపోవుటయు, ఆందోళన, ధననష్టం, బంధుజనులు వలన దుఃఖము, మాతృవంశ సూతకములు, వాహన ప్రమాదాలు తప్పవు. విదేశీ ప్రయాణాలున్నవారికి అనుకూలత త్వరగా వీసాలభించును. నూతనవ్యాధులు, భయాందోళనకలిగించు సంఘటనలు. ప్రయాణాలందు ఆరోగ్యభంగములు, అలసట, భార్యకు స్పల్పంగా ఆరోగ్యభంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట మనో దుఃఖములు, సోదర మూలకంగా విరోధాలు, నేత్రఉదర, సంబంధవ్యాధులు, మిత్రవిరోధాలు కలుగును.
కుటుంబంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును. కొన్ని విషయములలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు మీ బలమే కొండంత అండ. మీ తెలివితేటలు, ఎత్తుగడలతో కొన్ని కార్యములు సాధించుకోగలరు. తీర్ధయాత్రాఫలప్రాప్తి.
మొత్తం మీద ఈరాశి స్త్రీపురుషాదులకు శుభాశుభమిశ్రమఫలితాలు వచ్చును. కొంతమందిని అనుకూలత మరికొంతమందికి నిరుత్సాహం. ఎంతప్రతిభ కనపరచినా ఫలితంఉండదు. మీ శక్తిసామర్ధ్యాలు ఏమాత్రం పనిచేయవు. ఏపనితల పెట్టినాచాలాశ్రమపడి విజయంసాధిస్తారు. సంఘజీవనంబాగుంటుంది. సౌఖ్యం.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మిధున రాశి వారికి ఫలితాలు :-
ఈ రాశి వార్కి బుద్ధి, ధనము, కుటుంబ కారకుడైన గురుడు, బలీయంగా ఉండుట, శని, రాహువుల కూడా బలంగా యుండుటచే ఉన్నతస్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చును. ధనాదాయం చాలాబాగుండును. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం నూతన గృహలాభములు, కట్టడములు, గృహములో వివాహాది శుభకార్యములు ఆనందంగా జరుగును.
నూతన బాంధవ్యములు, పుణ్యక్షేత్రములకు వెళ్ళుట, వాహనలాభము, మనస్సుకు సంతోషమైన పనులు చేయుట, తమ యొక్క మాట చమత్కార, యుక్తి ప్రభావము చేత ఎంతటి వారలైన లోబరుచుకొనుట కలుగును. గత సంవత్సరంకంటే విశేష యోగం అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగును. తోడు లేకుండా ఏ పనికలసిరాదు. స్త్రీప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైన సాధిస్తారు.
మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని నడిపించేది. గతంలో ఉన్న జీవితాశయాలు నెరవేరును. లోగడ చేసిన ఋణబాధలు తొలగును. దైవీకమైన శక్తి, బలం ఒకవిధమైన ఆత్మీయత కలిగించును. శనిబలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. చేయు కృషి, వ్యవహారాలలో మార్పులు, క్రమేపి శరీర ఆరోగ్యం అంతరించుట స్త్రీ మూలక సంతోషము. కుటుంబ సంరక్షణ, నూతన కార్యప్రారంభములు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్థిలో మార్పులు భూగృహాదులు వలన తగిన ఆదాయం చేకూరును. అ ప్రయత్న ధనలాభములు, రెండు మూడు విధములైన ఆదాయం కలుగును. సాంఘిక సేవా కార్యములు చేయుదురు. దూరప్రయాణాలు.
మొత్తంమీద ఈరాశి స్త్రీ,పురుషాదులకు మంచియోగకాలంగా చెప్ప వచ్చును. గత సం॥రం కంటె మెరుగ్గా ఉండును. మీ యొక్క సామర్ధ్యములు, తోడుగా గ్రహబలం తోడగుటచే మీకు ఎదురులేకుండా పోవును. అనుకున్న జీవనం, సౌఖ్యం, ఆనందంగా జీవించగలరు. సమస్యలు తొలగును. సౌఖ్యము.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కర్కాటక రాశి వారికి ఫలితాలు :-
ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారుకుడైన గురుడు మంచిస్థానములందుండుట చేత ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు.
వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవప్రతిష్ఠలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి, అధికార వర్గముగా ఉపకారలాభాలు కలుగును. గృహనిర్మాణాది పనులు కలసివచ్చును. మీ జీవన మార్పులు వలన సంఘంలో గౌరవం. మంచిఫలితాలు ఇచ్చును. నూతనప్రయత్నములు ఫలించును.
బంధువర్గంలో మీప్రాముఖ్యత హెచ్చును. అన్నిరంగాలవార్కి జీవనవృద్ధి, రాజ పూజ్యతహెచ్చును. కుటుంబఔన్నత్యం. చిత్రవిచిత్ర వస్తు వస్త్ర మూలక ధనవ్యయం కలుగును. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును. అష్టమ శని వల్ల స్వల్పంగాఅనారోగ్యం, రక్తమార్పు, ధాతుబలం తగ్గుట, కళత్రవంశ పీడలు కలుగును. వాహనప్రమాదాలుగాన జాగ్రత్తగా, ఆచితూచి ప్రయాణాలు చేయవలెను. సోదరసోదరీలు అనుకూలత, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవనరంగములో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యములు,
భూగృహాదులుకొనుటలేదా పాతగృహంలో మార్పులు, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి, గుప్తస్త్రీసమావేశములు, వినోద విహారాదులు కలుగును.
పుణ్యక్షేత్ర సందర్శనములు, మనఃశ్శాంతి కలుగును. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైన జీవనం. దాంపత్య సౌఖ్యం.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం. ఊహించని విధంగాజీవిస్తారు. ప్రతిఒక్కరిదృష్టి మీపై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం లభించును. మీయొక్క శక్తిసామర్ధ్యాలు అందరికీతెలిసి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. అష్టమశనిప్రభావం స్వల్పంగా ఉంటుంది.
క్రోధి నామ సంవత్సరం (2034-25) లో సింహ రాశి వారికి ఫలితాలు :-
ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడైన గురుడు పదవరాశిలో రాహువు అష్టమందు ఉన్నందున సం॥రం ప్రారంభం నుండి నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కృంగదీయును. శరీరములో ఆరోగ్యబాధలు,నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసినవి తప్పక పోవుట, ఎంతమంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం, నెపముగా పరిణమించును.
అనేకఊహించని సంఘటనలు జరుగును. ప్రారంభంలో కష్టనష్టాలుగా కనిపించినా చివరకు ఆదాయం, రాజ్యపూజ్యత కొంత మేర కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు లభించును. మీయొక్క తెలివితేటలు వలన కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడుదురు. కళత్ర, సంతాన పీడలు, ధనవ్యయం,ప్రయాణాదులలోధననష్టం, చోరభయం, ప్రతీ విషయంలో ఆంతరంగిక భయం కలుగును. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్నకార్యము తలపెట్టినా ఆడవారి సలహా తీసుకొనుట మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు
సాగును.
బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్దితో మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకొంటారు.సాంఘికంగానూ, ఆధ్యాత్మికముగా కూడా దైనందిన కార్యములో అభివృద్ధి కన్పించును. ఒక్కోసారి ఆవేశపూరితంగా వ్యవహరించుటచే నష్టపోవుదురు.
మొత్తంమీద ఈరాశి స్త్రీపురుషాదులకు గ్రహసంచారం మిశ్రమంగా ఉన్నందు వలన అన్నివర్గాల వార్కిఇబ్బందులు. మీ యొక్కశక్తి సామర్ధ్యాలు, తెలివి తేటలు,ధైర్యసాహసాలఫలితం ఉండదు. ప్రతీచిన్నవిషయం యోచించి మసలు కోవలెను.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కన్యా రాశి వారికి ఫలితాలు :-
ఈ రాశి వారలకు గురుడు భాగ్యమందు సంచారం, శని ఆరింట బలీయుడు, ఈ సం॥రం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉండును. మీలో ఎన్నో రకముల సామర్ధ్యాలున్నా ముందుకు వెళ్ళ లేకుండుట జరుగును. అకారణముగా మాటలు పడుట, రావలసిన బాకీలు రాకుండుట, ఆదాయమునకు అంతరాయం. లోలోపల అధైర్యంఏర్పడును.
రక్తబంధు వర్గములో కలతలు. అశాంతి, మనస్సు ఆందోళనచెందుట, మందత్వం, గుప్తశత్రుభాధలు, స్వంతపనుల కంటే పై వారి పనులలో శ్రద్ధ, లేనిపోని అనుమానాలకు మనస్సులోనగుట, మీ సొమ్ముతిని ఉపకారం పొందినవారే శత్రువులుగా అగుదురు. ఆడవారి ప్రేరేపణచే జరుగు పనులలో ఆందోళన హెచ్చును. ధనవ్యయంమీదకొట్టివేయును. పుణ్యక్షేత్రసంచారం.
గృహమార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి. ఔషధసేవలు చేయుట, చోరభయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదులలో మార్పులు, ఏదోరూపంగాధనంచేతికి అందుచూ అనేకరకములుగా సొమ్ము హారతి కర్పూరంవలె హరించును. శారీరక మానసిక బాధలు తప్పవు. ఆందోళనలు హెచ్చును. వ్యసనాలు ద్వారా ధనవ్యయం. వృధాగా కాలక్షేపం చేయుట, శని బలీయంగా ఉండుటచే కొన్నివిషయాలలో ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ధైర్య సాహములే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును.
భార్యాభర్తలమధ్య ఒక్కోసారి మాటమాటా పట్టింపులు, విడిపోయేంతవరకు సమస్యలు వచ్చును. బంధుమిత్రుల అరిష్టం. కావలసినవారు దూరమగుట జరుగును.మొత్తం మీద ఈ సం॥రం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుండును.
కొందరికి యోగం, మరికొందరి అవయోగం. శని బలంగా ఉన్ననూ రాహు, కేతువులు బలం లేని కారణంగా జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోనికిరావు. ఊహించని సమస్యల వల్ల చాలా ఇబ్బందులు.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో తులా రాశి వారికి ఫలితాలు : -
ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవికబలం హెచ్చుగానుండును. ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 8వ ఇంట సంచారం. ఏపనిలోనైనా ఆత్మవిశ్వాసముతో ముందుకు పోగలుగుట, రాహు, కేతువులు, బలము వలన శని, 5వ స్థానంలో ఉండుట విశేషించి యోగమును అనుభవిస్తారు. శతృవులు అంతరించుట వ్యవహారాదులలో జయం. గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలించును.
ఏ వృత్తివ్యాపారాదులలో ఉన్న వారలకైనా బాగుండును. ఒడిదుడుకుల నుండి బయటపడుదురు. రావలసిన సొమ్ములు వచ్చును. గృహసబంధరీత్యా లాభములు, నూతన గృహములు నిర్మించుట కనీసం ఇండ్ల స్థలమైన కొంటారు. అపనిందలు వంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయ క్షేమం కలుగును. సాంఘికాభివృద్ది, మనోవాంఛలు నెరవేరి, స్వశక్తి సామర్థ్యముచే పైకిరాగలరు. ఒక్కో సమయాన ఆదాయమునకు మించిన ఖర్చులు చేయుదురు.
శతృత్వములు వచ్చినా అణచివేస్తారు. నూతన ప్లానులు పోకడలచే సంఘంలో గౌరవాదులు లభించును. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహంలో వివాహాది శుభకార్యాలు కలసి వచ్చుట, దాంపత్యానుకూలత, గృహ జీవితానందం కలుగును. ప్రతీచిన్నవిషయమునుమీకు అనుకూలంగా మలచుకొందురు. 8వ ఇంట గురువు వలన గృహ సంబంధమైన ఒత్తిడి ఒడిదుడుకులు ఆర్ధికంగా సర్దుబాటులేకున్ననూ ఏదోలా ధనము చేతికి అందును. మీలో గల నిజాయితీ, ప్రవర్తన కొంతమేర
కష్టములనుండి కాపాడును. పనివారలు వలనదొంగలు వలన మోసపోవుదురు.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, మిమ్మల్ని రక్షించును. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం. మంచిఅభిప్రాయంకలుగును. అన్నివిధములుగా బాగుండును.
క్రో ధి నామ సంవత్సరం (2024-25) లో వృశ్చిక రాశి వారికి ఫలితాలు : -
ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ గౌరవకారకులైన గురుడు 7వ స్థానంలో సంచారం. రాహువు, కేతువులు 5,11స్థానములలో సంచరించుట, అన్నిరంగములలో జయమగును. మీ ఆశయములు మనోవాంఛలు సిద్దించును.
ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా సాగి ఫలించును. లోగడ వదలివేసిన వ్యవహారాలు కలసివచ్చును. అధికారుల యొక్క అనుగ్రహం, బాకీలు వసూలగుట, మహోన్నతికి రాగలగుట జరుగును. అర్ధాష్టమ శని ప్రభావం వున్ననూ జీవనము మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లు జీవితాధిక్యత, అన్నిరంగాలలో ఉన్నతస్థితి, ధనాదాయంనకు స్వల్ప అవమానకరమైనమాటలు, పనులు, ఇతరులకు బాధకలిగించేవి చేస్తేనే గాని మీకు జయం చేకూరదు. ఆడవారి ప్రోద్భలములచే ఉత్సాహ ప్రోత్సాహాలుసిద్దించును. మానసికధైర్యం, సూక్ష్మబుద్ధి, యోచనాశక్తితో మీరు ముందుకుపోగలరు. దూరప్రయాణాలు, తీర్ధయాత్రలు చేయుట, స్థిరాస్థివృద్ధి జరుగును.
శని, కుజులువల్ల కుటుంబ కలతలు, భార్యాబిడ్డలు వలన మధ్య మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గురుబలం వల్ల వాటిని చివరినిముషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయిన పనులతో జయం ఆధ్యాత్మిక సాధన, పుణ్యనదీస్నానం, అధికారప్రాబల్యం. వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును.మీమాటకువిలువ, భూ, గృహాధిపేచీలుతొలగి ఆనందమైన జీవనం లభించును.
ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు, గృహనిర్మాణాలు కలిసివచ్చును. నూతన వాహనములు కొంటారు. జీవితంలో సమస్యలు తొలగి సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కలిసి దూరప్రయాణాలుచేస్తారు.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల జీవనం సౌఖ్యంగా
ఉంటుంది. కొన్నివర్గాలవార్కిబాధలుతప్పవు. శుభాశుభమిశ్రమఫలితాలుండును.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో ధనుస్సు రాశి వారికి ఫలితాలు :-
ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు 6వ ఇంట, రాహువు, కేతువులు 4,10స్థానములలో ఉండుటచేతను, శనిస్థితి యోగించును. అన్నిరంగములో తమ జీవితమునకు విలువతెచ్చుకుంటారు. అధికారవర్గములో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. ధైర్యసాహసములు ' పెరుగుట, కొన్ని శక్తులు సమకూరుట వల్ల ఆత్మీయతను పెంపొందించుట సంఘంలో మంచి స్థానము.
బంధుమిత్రుల ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివి తేటలను అందరు గుర్తించెదరు.
మీరుచేయుపనులకు, గృహజీవితంలో నరఘోష ఎక్కువ. ఎంతటి ధనవ్యయంమైనా లెక్కచేయక విజయంసాధించుట, సొంతవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్దఎక్కువ. మీ వాక్ప్రభావం గొప్పది. మీరుమాట్లాడే మాటలు అందరికి రుచించును. ప్రతీ పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబ సమస్యలు తప్పవు.
కుటుంబ వ్యక్తుల వల్ల ధనవ్యయం తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతలు మూలకంగా ధనవ్యయంతప్పదు. సోదరులనుకునేవారి వల్ల ధననష్టం. ఊహించని సమస్యలలో ఇరుక్కొనుట, గురుబలంవల్లవాటినుండి బయటపడుదురు.
కుటుంబసమస్యలువల్ల ప్రతీచిన్నవిషయాన్ని గమనించి మసులుకోవలెను. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగును.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు, రాహువుల ప్రభావం వల్ల శని ప్రభావం వలన జీవన సౌఖ్యం, సాంఘికంగా, మానసికంగా ఉత్తేజంతో జీవించగలరు. కాని కొంతమేర జాగ్రత్త అవసరం. మీ ధైర్యమే మీకు రక్షణ.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మకర రాశి వారికి ఫలితాలు :-
ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ కారకుడు గురుడు 5వ ఇంట, లగ్నాధిపతి శని 2వ ఇంట బలీయంగా ఉండుటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బేలన్సుగా ఉండును. పట్టుదల ఎక్కువ.
ఎంతటి వారినైనా లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముఖాలుగా చేతికందును. ఒడిదుడుకులు లేని జీవితమైఉండును. మీమాట, ఆడవారిమాట ఒకటైరాణించును. మీ నమ్మకం,
మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారం, పుణ్యనదీ స్నానం. పుణ్యకార్యాలు చేయుదురు. ఎంత ఆదాయమో అంత ఖర్చుఅగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారులు వలన కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్నపానీయములు స్వశక్తి సామర్ధ్యములపైకి రాగలుగుట జరుగును. మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును.
మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారంకలుగును. మీలో దైవత్వం, పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యంఉండదు. గతసంవత్సరం వలెనే ఉంటుంది.స్త్రీప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కల్గించును. సద్దోష్టులు చేస్తారు. ధర్మ బుద్ధితో ఉంటారు. అన్నిరంగాల వార్కి యోగ్యకాలమని చెప్పవచ్చు. స్తిరాస్తులు కొంటారు. గృహమార్పులు, స్థానమార్పులు, పాతగృహంలో మార్పులు, స్వల్పంగా దొంగల వల్ల నష్టాలు, ప్రయాణాదులలో ఇబ్బందులు, సోదరమూలక నష్టాలు.
ఏల్నాటి శని ప్రభావం కొంత తగ్గుటచే ఉద్యోగస్తులు గతంలో ఉన్న సమస్యల నుండి బయట పడుదురు. మీపై ఉన్న కేసులు తొలగును. పై అధికారుల మన్ననలచే ప్రమోషన్తోకూడిన బదిలీలు జరుగును. స్త్రీలు సంతోషంతో ఉందురు.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జీవనం బాగుండును. ఏల్నాటి శని ప్రభావం తగ్గును. రాహువు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైనకుటుంబ జీవితం. సాంఘికంగా, మానసికంగా ఉన్నతస్థితిలభించును. ఈర్ష్య అసూయ మీ పై ఉండును.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో కుంభ రాశి వారికి ఫలితాలు : -
ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ కారకుడైన గురుడు వృషభంలో శని జన్మంలో ఉండుటచే మీ గృహకుటుంబ పరిస్థితులు సాంఘిక ముగాను, గృహ సంబంధముగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రధమార్ధంలో బాగుంటుంది.
ఏపని తలపెట్టినా అవలీలగా పూర్తిచేయగలరు. సెప్టెంబర్ నుండి అగ్నిభయము.దొంగల వలన భయం. వృధాగా శ్రమపడుట, ప్రయాణములందు కష్టములు,నష్టములు ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు. కావున దైవధ్యానం చేయాలి. నామ,జపం వ్రతముచే వెలుగు నీడలుగా పరిణమించిన మీ జీవితం ధన్యత నొందును.
మీ ఆరోగ్యం చక్కగా చూచుకొనేది. గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమితం లేకఏమి మాట్లాడుచున్నారో మీకు తెలియని స్థితిగా ఉంటుంది. ఇంద్రియ పటుత్వం దిగజారును. ధాతుబలంతగ్గును. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలకు లోటురాదు. ప్రతి పని లాభదాయకముగా కన్పించినా లోలోపల పడే బాధలు దేవుని కెరుక అన్నట్లుండును. అధికార వర్గము, బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయును. ఎంతకష్టపడి సంపాదించినా చివరకు ఏనుగు మ్రింగిన వెలుగ
పండుమాదిరి అనిపించును. మీలోగల మంచితనం వల్ల ఎంతటి గడ్డు సమస్యలైన తప్పించుకుంటారు.
గౌరవము నిలబడినా ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు.ఏల్నాటి శని ప్రభావం మీపై దుష్ప్రభావం చూపించును. ఆరోగ్యభంగములు.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగష్టువరకు పరిస్థితులు అనుకూలం. ఊహించని సమస్యలు. జీవితంలో మరచిపోలేని సంఘటనలు జరుగును. మీ శక్తి సామర్ధ్యములు మిమ్మల్ని రక్షించలేవు. బంధుమిత్ర అరిష్టములు. నష్టము.
క్రోధి నామ సంవత్సరం (2024-25) లో మీన రాశి వారికి ఫలితాలు :
ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ జీవన కారకుడైన గురుడు 3వ ఇంట సంచారం. రాహువు కేతువులు అనుకూలసంచారం లేనందున మీకు స్వవిషరాయంలో ధైర్యం తక్కువ. ధనాదాయం అనేకరకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్యలేక స్త్రీమూలకంగానే మీజీవితం నిలబడును. శారీరకముగా నిరుత్సాహము. దిగులు ఔషధసేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉండును.
మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్ధిక చికాకులకు లోనగుట.
ద్వితీయార్ధం నుండి యోగ ఫలములు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగుండి రాజదర్శనం, శరీరపోషణార్ధం ఇష్టకార్యసిద్ధి, కుటుంబసౌఖ్యం. ధన లాభాలు,సర్వతో ముఖాభివృద్ధి, తీర్ధయాత్రా ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్యం, సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాదులలో లాభం. భార్యా, పిల్లలు, కుటుంబంపై లోలోపల అధైర్యంచెందుటకలుగును.
కొన్నిసందర్భములలో శత్రువులే మిత్రులగుట, పుణ్య క్షేత్రాది దివ్యసందర్శన భాగ్యంచే కొంత మనఃశ్శాంతి చేకూరును. ఎట్టి లోటుపాట్లు కలుగవు. గౌరవం నిలబెట్టుకొనుటకే వ్యయం. మీరు సాంఘికంగా ఉండవలసిన వ్యక్తులగుటచే శతృభీతి హెచ్చును. దైవభక్తి, శక్తి, బంధువర్గములో ప్రత్యేకత కలు గును. మొత్తం మీద అన్నివిధాలుగా అందరికీ ఈ సం॥ యోగదాయకంగా లాభ
దాయకంగా ఉండును.
ఏల్నాటి శని జన్మరాహువు ఉన్నప్పటికీ గురుబలం వల్ల ముందుకు పోగలరు. ఉద్యోగస్తులకు అనుకూలసమయమే. ఆదాయంకు మించిన ఖర్చులు చేయుదురు. గృహంలో శుభకార్యములు కలిసివచ్చును. ధైర్యం పెరుగును.
మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన సం॥రం మీ పనికితగ్గగుర్తింపు. తెలివి తేటలు సద్వినియోగపడును. జీవనలాభం, ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలం గడుచును. గత సం॥కంటే అనుకూలసమయం.