08/09/2024
జిట్ట మరణం నుండి కోలుకోక ముందే తెలంగాణ ఉద్యమ నేత, సుదీర్ఘకాలం టిఆర్ఎస్ లో ఉండి నాతో పాటు తెలంగాణ ఉద్యమ వేదికల వ్యవస్థాపక సభ్యుడు నాయకుడై, ఎన్నోసార్లు నాతోటి జైలుకు వెళ్లి.. తను శాశ్వత అడ్రస్ తెలంగాణ ఉద్యమకారుడే అని చాటి ఏ రాజకీయ పార్టీ జెండా కప్పుకోకుండా నిరంతరం నకిరేకల్ ప్రజలకు ఏదో ఒక సహాయం చేసే గొప్ప మనిషి..నిరంతర కృషివలుడు.. నిజమైన రైతు.. తెలంగాణ ఉద్యమ కవాతు...యానాల లింగారెడ్డి ఊహించని పాముకాటు ప్రమాదంలో మరణించారు.
ఎన్నోసార్లు అనారోగ్యం పాలైన అన్ని ఆటంకాలను జయించి...పాము కరిచిన పది నిమిషాలలోనే గుండెపోటుకు గురై హాస్పిటల్ చేరకముందే చనిపోయారు.
40 ఏళ్ల మా అనుబంధం,, వ్యక్తిగతంగా రాజకీయంగా అవిభక్త కవలల తీరు సాగింది. ఎన్నిసార్లు జైల్లో, ఎన్ని రాస్తారోకోలు ఎన్ని మానవహారాలు, ఎన్ని లాటి చార్జీలు, ఎన్నిసార్లు రక్తనాళాలు చిట్లేదాకా జై తెలంగాణ నినాదాలు.., ఎన్నిసార్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలని తెలంగాణ యావత్ తిరిగిన పాదముద్రలు,ఎన్ని అవమానాలు ఎన్ని మోసాల మధ్య తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చాలని స్వతంత్ర ఆలోచనతో కార్యాచరణ... పెద్ద పెద్ద టీవీలకు ఇప్పుడు తెలంగాణలో ఏవి వార్తలు, ఏమి ప్రచారాలు అర్థం కాని గందరగోళంలో... ఒక నికార్స్ అయిన ఉద్యమకారుడి చావు వార్త ముఖ్య శీర్షిక కాకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమ అత్యున్నత శిఖరం మీద రెపరెపలాడే ఒక ఆకాంక్ష జెండాను ఎగవోస్తు, ఎగబోస్తూ ఎవరెస్టుపై ఒక టెన్సింగ్ నార్కే లాగా నిలబెట్టిన అనేకమందిలో లింగారెడ్డి ముందు వరుసలో వాడు. తెలంగాణ ఉద్యమ ఫలాలు అనుభవిస్తున్న ఎవరైనా ఇదిగో ఇది లింగారెడ్డి లాంటి అనేక ఉద్యమకారుల కష్టార్జితం అని, ఆయన లాంటి అనేక ఉద్యమకారులకు ఏ ఫలాలు అందకపోయినా భవిష్య తరాలకు కొట్లాడినారని గుర్తుపెట్టుకుని మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తే చాలు!
వీరులను తలుచుకుందమా!జమకు జమ ఎర్రజెండా.. పాట పాడుకున్నట్టు .. అనేకమంది ఉద్యమ వీరులు, మనకు కాళ్లు చేతులు అయిన వాళ్ళు, మన కాళ్లల్లో తిరిగిన వాళ్ళు.. గుర్తొస్తే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగేవాళ్లు ...వాళ్లంతా ప్రాత కాల స్మరణీయులు.
లింగారెడ్డి అంతిమయాత్ర నకిరేకల్ లో మధ్యాహ్నం మూడు గంటలకు మార్కెట్ రోడ్ లో ఉన్న ఇంటి నుండి ప్రారంభమవుతుంది. రండి! కడసారి చూపు మాత్రమే కాదు.. కడసారి పిడికిలెత్తి జై కొట్టడానికి, అమరునికి జోహార్లు అర్పించడానికి.