27/04/2023
అనంత సాహితీ వేదిక 20-4-2023 పోటీలో ఎంంపిక చేసిన కవిత
అంశం: ప్రాణం ఖరీదు
------------------------------
గొడ్డలి స్నానం చేసింది...
పాత నేత చచ్చి పడున్నాడు...
నేరస్థుడు నేతయ్యాడు.
* * *
జైలు తలుపు కిర్రుమంది...
జయజయ ధ్వానాలు దద్దరిల్లాయి...
పూలు చినుకులైనాయి...
రక్తం మరకలు ఎండి రాలిపోయిన
నాయకుడి రథోత్సవం సాగుతోంది...
వాకిట్లో బిక్కుబిక్కుమంటూ
హతుడి కుటుంబం.
* * *
ఓ అగ్గి పుల్ల
మతానికి మంటపెట్టింది...
కిరాయి మూకల
కత్తుల దాహం తీరింది...
కళ్ళు తెరిచిన చట్టం
హంతకులని కటకటాల్లోకి నెట్టింది...
ప్రజలెన్నుకున్న ప్రభుత్వం
పెద్ద మనసుతో క్షమించేసి
జైలు తాళం తీసింది...
ఆరిపోయిన చితిముందు
బేలగా బాధిత కుటుంబాలు.
ప్రజాస్వామ్యం
కొత్త ముఖమేసుకొని
ప్రాణాలకి ఖరీదు కట్టేస్తుంటే
కాలం కాళ్ళీడ్చుకుంటూ పోతోంది
చేవచచ్చిన జనాలని
చీదరించుకుంటూ.
___ రామిశెట్టి భాస్కర్ బాబు
9849166103.