16/04/2026
*అంధ విశ్వాసాలపై సమరం సాగించిన శక్తి కందుకూరి వీరేశలింగం*
- హితకారిణి సమాజం చైర్మన్ డా. యాళ్ల ప్రదీప్ సుకుమార్
- వీరేశలింగం సమాధి వద్ద నివాళులర్పించిన నగర ప్రముఖులు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16 : తెలుగు నవయుగ వైతాళికుడు, ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి హితకారిణి సమాజం చైర్మన్ డా. యాళ్ల ప్రదీప్ సుకుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బోర్డు డైరెక్టర్లు ఆదిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, శ్రీమతి మేడపాటి సాయి భాగ్యలక్ష్మి, శ్రీమతి కుచ్చరపాటి లలితరాణి, గుణ్ణం శ్యామ్ సుందర్, శ్రీమతి సి .హెచ్ అనంత సత్య నాగవల్లి, కొడమళ్ళ శ్రీనివాసరావు, తణుకు శేష రత్నకుమారి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు మరియు పలువురు నగర ప్రముఖులు స్థానిక వై జంక్షన్ వద్దనున్న ఆనంద గార్డెన్స్ నందు కందుకూరి వీరేశలింగం దంపతుల సమాధి వద్ద పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. యాళ్ళ ప్రదీప్ సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం తెలుగు భాషాభివృద్ధికి, మూఢనమ్మకాల నిర్మూలనకు, మహిళాభివృద్ధికి కృషి చేసిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. వితంతువులకు పునర్వివాహాన్ని జరిపించి, మహిళా విద్యను ప్రోత్సహించారన్నారు. ఆయన స్థాపించిన హితకారిణి సమాజం ద్వారా అనేక సాంఘిక సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఆయన మరణానంతరం కూడా హితకారిణి సమాజం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పుతుందని తెలిపారు. ఆ మహానీయుడు ఆశయ సాధనలో భాగస్వామ్యులు కావడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో హితకారిణి సమాజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె.ఆర్ ఏం.బి.ఏ మహిళా కళాశాల, వి.టి జూనియర్ కాలేజ్, ఎస్ కే వి టి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్.కె.ఆర్ ఉమెన్స్ హాస్టల్, హితకారిణి సమాజం సిబ్బంది పాల్గొన్నారు.