06/08/2023
పత్రికా ప్రకటన
*స్వచ్ఛ నంగునూరు సాధించే కార్యక్రమమే రుతుప్రేమ*
*అందరూ భాగస్వాములై కార్యక్రమం విజయవంతం చేయాలి*
*నంగునూరు మండల టెలి కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు*
నంగునూరు 06 ఆగస్టు 2023: స్వచ్ఛ నంగునూరు సాధించే కార్యక్రమమే రుతుప్రేమ. మన కుటుంబంలోని మహిళా సభ్యుల ఆరోగ్యానికి సాయం, సేవ అందించే కార్యక్రమంగా భావించాలి. అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. నంగునూరు మండల ప్రజాప్రతినిధులు, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీపీఓ దేవకి, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, మండల, గ్రామ అధికారులు, సిబ్బందితో కలిసి 325 మందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే నియోజక వర్గ పరిధిలోని సిద్ధిపేట అర్బన్, రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు పూర్తయినట్లు ఇక సోమవారం నుంచి నంగునూరు మండలంలో రుతుప్రేమ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు, వారం రోజుల్లో మండలాన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు, ఇందుకు మండల, గ్రామ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని, క్షేత్రస్థాయిలో అధికార సిబ్బంది సహకారాన్ని అందించాలని కోరారు. మహిళల ఆరోగ్యం కాపాడటమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, మహిళల డబ్బు ఆదా చేసిన వారమవుతామని వివరించారు. ఈ రుతుప్రేమ ద్వారా మహిళ ఆరోగ్యం కాపాడటంతో పాటు స్వచ్ఛ గ్రామాన్ని చేసుకోవచ్చునని తెలిపారు. మన రాష్ట్రం కానప్పటికీ బెంగళూరు నుంచి మట్టి మీద ప్రేమతో సామాజిక బాధ్యతతో కృషి చేస్తున్న పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అంతకు ముందు జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఈ వారమే రుతుప్రేమ సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మంగళవారం రోజున సూర్యాపేట మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్ల బృందం సిద్ధిపేటకు రానున్నదని, సిద్ధిపేట స్వచ్ఛబడితో పాటు నంగునూరు మండలం అక్కెన్నపల్లిలో జరిగే రుతుప్రేమ కార్యక్రమంలో హాజరవుతారని తెలిపారు.