01/10/2022
శ్రీలలితా సహస్రనామం
१०००.లలితాంబికా-
¹"లోకానతీత్య లలితే లలితా తేన సోచ్యతే" అనెడి పద్మ పురాణ నిర్వచనానుసారముగా లలితా అనగా, సకల లోకములను మించి ప్రకాశించుచున్న, అంబికా - అమ్మ అని అర్థము.
అతివ్యాప్తి, అవ్యా ప్తి, అసంభవము అనెడి దోషములు లేకుండునట్లు అత్యంత అసాధారణముగా ప్రయోగింపబడినట్టిది. ఈ నామము.
ఎట్లన, ఇతర దేవతలకును, రాధ యొక్క ఒక చెలికత్తెకును, ఒక నదికిని 'లలితా' అనెడి పేరు కలదు. 'అంబికా' అనెడి నామముగూడ ఒక దేవతకును, జైనులు ఉపాసించు ఒక దేవికిని, ధృతరాష్ట్రుని తల్లికిని ఇతరత్రకూడ వర్తించుచున్నది.
1లలితా, 2అంబికా అని యీ రెండు చేరిన నామము కేవలము ఒక్క పర దేవతకే వర్తించుచున్నది. ఊరక 'లలితా' అనిన చాలును. కాని సకల లోకాతీతమయిన ఆ దేవి మనకు సంనిహితురాలు (అందునది) కాదు అనెడి భావమును తొలగించుటకై అంబికా (మన అమ్మయే) అనెడి ఆశయ ముతో 'లలితాంబికా' అని చేర్చి ప్రయోగింపబడినది.
బ్రహ్మాండపురాణమున ఉ త్తరఖండమున ఈ స్తోత్రమున్నట్లు చెప్పబడినది. కాని ఈస్తోత్రముననే బ్రహ్మాండమున్నట్లు గోచరించుచున్నది. గంధర్వరాజు పుష్పదంతుడు చెప్పినట్లు కల్ప తరుశాఖను కలముగా, భూమిని కాగితముగా, సముద్రమును సిరాబుడ్డిగా, కాటుక కొండను సిరాగా చేసికొని, సరస్వతీ దేవి సర్వకాలము వ్రాసినను ఈ నామములయొక్క అర్థము సమా ప్తము కాదు అనుట న్యాయ్యము. శబ్దసముద్రము అట్టిది.శబ్దార్థము అట్టిది, అభియుక్తోక్తి ఒకటి యిట్లు కలదు. "అహం భాష్య కారశ్చ కుశాగ్రీయ ధియా వుభౌ, నైవ శబ్దంబుధేః పాఠం కిమన్యే జడబుద్ధయః" అని.
"లోకా నతీత్య లలతే" ఇతి లలితా, సర్వలోకములకు అతీతముగా ప్రకాశించుచుండునది. లోకములు అనగా సకలదృశ్యములు. ఆబ్రహ్మ స్తంబపర్యంతము. మఱియు, అహమాది దేహాంతము (నేను అనునది మొదలుకొని దేహపర్యంతము). ఈ సమస్త దృశ్యముల ఉనికికంటెను, వీని లేమి కంటెను అతీతముగా అనన్యముగా అద్వితీయముగా ప్రకాశించునది. ప్రత్యేగభిన్న పరబ్రహ్మస్వరూపిణి అని యర్థము.
² ఈ శరీర మున మూలాధారాది షట్ చక్రములకు పైన బ్రహ్మరంధ్రమునకు క్రింద సహస్రారకమలమున ప్రకాశించునది అని యర్థము.
³ శ్రీ చక్రమున నవావరణములను అతిక్రమించి సర్వానంద మయ బిందు చక్రమున ప్రకాశించునది.
4. సకల లోకము లను - సకల బ్రహ్మాండములను దాటి (వీని నతిక్రమించి) యున్న శ్రీనగరమున - శ్రీపురమున మిక్కిలి ప్రకాశించుచున్న అంబిక-అమ్మ అని యర్థము. కావుననే చెప్పియున్నారు.
అంబికా - అమ్మా! సకలలోకాతీతములైన ఔదా ర్యము, గాంభీర్యము, తేజస్సు, మాధుర్యము, లాలిత్యము, విలాసము. శోభ, స్థైర్యము అనెడి దివ్యగుణములు గలదానవు, కావున "లలితా" అనెడి యీ పేరు నీకు తగినది" అని.అఖిల దివ్యశక్తులచే అత్యంత ఆదరముతో అర్చింపబడు చుండెడి దివ్యురాండ్రు తొమ్మండుగురు ఆవరణ దేవతలా నీ సేవకురాండ్రు. నీ ధనుస్సా చెఱకు. నీ బాణములా పుష్పములు. అంతయు, లలితము - సుందరము.
"సత్యమేకం లలితాఖ్యం వస్తు" "తదద్వితీయ మఖండార్థం పరంబ్రహ్మ" "సృణ్యేవ సితయా, ఇషుభిః పంచభిః ధనుషా చ" " పాశాంకుశ ధనుర్బాణధరామ్" "ప్రాతస్సూర్యసమ ప్రభామ్” “మనోజ్ఞ పాశాంకుశ పాణివల్లవామ్” “మహా కారుణ్య రూపిణీమ్” "భక్తకామదుఘాం భజే" అని శ్రుతి వాక్యములు. "శ్రీర్వాక్చనారీణామ్" అని భగవద్వాక్యము, "ఘృత కాఠిన్యవత్ మూర్తి " అని సూతసంహితా వాక్యము. " పాశాంకుశేక్షు సుమ రాజత పంచశాఖాం... ప్రాచీన వాక్ స్తుతపదాం పర దేవతాం తాం.... ప్రణమామి దేవీం" అని, "ఘృత కాఠిన్య న్యాయేన మూర్తిమత్వమ్" అని భగవత్పాదవాక్యము (త్రిశతీ భాష్యము),
1000.She who is the divine mother lalitA
ఇది శ్రీబ్రహ్మాండ పురాణమున ఉత్తర ఖండమున శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదమున "శ్రీ లలితా రహస్యనామ సాహస్ర కథన" మనెడి పేరుగల రెండవ అధ్యాయమునకు మద్గురువరేణ్యులు శ్రీశుద్ధచైతన్యయతి కృతమైన తెలుగు వివరణము
సమాప్తము.
┈┉┅━❀꧁꧂❀━┅┉┈
ఎస్.ఎస్.కే.పి
శారదా శ్రీవిద్యా పీఠం,
వీరశైవ ఆశ్రమం,(రి)
మల్లేశ్వరం,పెరవలి మండలం,ప.గో.జిల్లా,ఆంధ్రప్రదేశ్.
534330