01/02/2020
మహాతేజం రథసప్తమి ..
రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ.మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.రథసప్తమి మహా తేజం.మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు..
* సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.
అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
-ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.
*ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకం
*నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః*
*అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!*
*యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!*
*తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!*
*సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!*
*పూజ విదానం:-*
చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి,భాను, వివస్వత,భాస్కర, సవిత,అర్క,సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే.శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.
ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే! ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.
* చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం. సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి.
1.ఈ జన్మలో చేసిన
2.గత జన్మలో చేసిన
3. మనస్సుతో
4. మాటతో
5. శరీరంతో
6. తెలిసీ
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.
ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది..