15/03/2024
*ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం : 14-3-24*
------------------★★-------------------
మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు దశాబ్దాలలో మూత్ర పిండాల సంబంధిత రోగులు రెట్టింపు అయ్యారు. మన దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు రెండు లక్షలు ఉండగా, ప్రతి సంవత్సరం కేవలం పన్నెండు వేల మూత్ర పిండ మార్పిడులు అవుతున్నాయి. ఈ లెక్కలన్నీ, మూత్ర పిండాల ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియ చేస్తాయి. అయితే ఈ సమస్య తగ్గించడం కోసం, దాని కారణాలు గురించి, తీవ్రత తగ్గించడానికి అవసరమైన అవగాహన గురించి ఇప్పుడు చూద్దాం.
*కారణాలు:*
కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం అదుపులో లేని మధుమేహం. అది కాక, అధిక రక్తపోటు, కొన్ని సార్లు బీ.పీ తగ్గిపోవడం వల్ల, ఎన్నో ఇతర ఇన్ఫెక్షన్లు( డెంగూ, మలేరియా, HIV, మొదలు కొని, అనేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు), మూత్ర పిండాల రాళ్ళు, కొన్ని రకాల మందుల (నొప్పి తగ్గడానికి వాడే మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, కొన్ని యాంటీబయాటిక్స్) వల్ల, ముఖ్యంగా, మోతాదు తెలియని వాళ్ళు ఇచ్చే పసరు మందులు, చెట్ల మందుల వల్ల, కొన్ని సార్లు జన్యు పరమైన సమస్యల కారణంగా, లూపస్ (SLE) వంటి కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు (మహిళల్లో అధికంగా), మూత్ర పిండాలు పాడు అవడానికి కారణం అవ్వవచ్చును.
*లక్షణాలు:*
లక్షణాలు అనేవి మొదట వ్యాధికి కారణాన్ని బట్టి ఉండవచ్చును. దీర్ఘ కాలిక జబ్బుల వల్ల మూత్ర పిండాలు పాడు అయి ఉంటే, ముందుగా మొహం వాపు, తరవాత కాళ్ళు మరియు శరీరం అంతా వాపు రావొచ్చు. మూత్రం సరిగ్గా రాకపోవడం, నడిస్తే ఆయాసం రావడం, పడుకుంటే ఆయాసం రావడం సాధారణంగా ఉంటాయి.
ఒక వేల మూత్ర పిండాలు దెబ్బ తినడానికి రాళ్ళు కారణం అయితే, నడుములో నొప్పి, అక్కడి నుండి గజ్జల్లోకి రావడం, చలి జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలతో ప్రారంభం అవ్వచ్చు.
ఇతర ఏవైనా ఇన్ఫెక్షన్ల వల్ల మూత్ర పిండాలు పాడయి ఉంటే వాటికి సంబంధించిన వ్యాధి లక్షణాలు, లేక నొప్పి మాత్రలు, స్టెరాయిడ్ వంటి మందులు అధికంగా వాడడం వల్ల జరిగి ఉంటే, రోగికి వాపులు ఏమీ లేకుండా, మూత్రం మామూలుగానే వస్తూ, ఏకంగా ఆయాసంతో రోగి వైద్యులను సంప్రదించే అవకాశం ఉంది.
*పర్యవసానాలు:*
ఒంట్లో రక్త కణాలు తయారు అవ్వడానికి అవసరమైన ఒక ముఖ్యమైన హార్మోన్ (erythropoietin) మూత్ర పిండాల లో ఉత్పత్తి అవుతుంది. అందుకే మూత్ర పిండాలు పాడయిన వారికి, హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది. దానితో రక్తహీనత, అందువల్ల ఆయాసం, నీరసం, అలసట వంటి లక్షణాలు కలగవచ్చు.
అలాగే మన శరీరంలోని కండరాలు, యముకలు బలంగా ఉండడానికి ఎంతో అవసరమైన విటమిన్ డీ మొదలగునవి మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతాయి. అందుకే విటమిన్ డీ తగ్గిపోవడం వల్ల కలిగే నీరసం, ఒళ్ళు నొప్పులు అలసట వంటివి మూత్ర పిండాల వ్యాధిగ్రస్థుల్లో సర్వ సాధారణం.
మూత్రపిండాలు మన రక్త పోటును నియంత్రించే ముఖ్య మైన అవయవాలు. కాబట్టి, మూత్ర పిండాల సమస్య ఉన్న వాళ్లకు రక్తపోటు అదుపులో ఉండకపోయే ప్రమాదం ఉంది. అధిక శాతం వారు అనేక రకాల మందులు వాడ వలసిన అవసరం ఉంటుంది. అయినా అప్పుడప్పుడు బీ.పీ హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
మూత్రం తగ్గి, ఒంట్లో అధిక నీరు చేరి పోవడం వల్ల, గుండె పైన ఒత్తిడి పెరిగి, అది సరిగ్గా పని చేయలేక పోవడం, దానితో గుండె వాపు, ఆయాసం, ఊపిరి తిత్తులలో నీరు చేరి పోవడం, దానితో, ఊపిరి అందక, అపస్మారక స్థితిలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది.
రక్త ప్రసరణ బాగా అవ్వడానికైనా, రక్తం గడ్డ కట్టడానికి అయినా, మూత్ర పిండాలు సరిగ్గా పని చేయడం ముఖ్యం. అందుకే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.
*గుర్తించడం ఎలా :*
మూత్ర పిండాల సమస్యను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులువుగా అవుతుంది
కేవలం రెండు చిన్న, అతి తక్కువ ఖర్చుతో చేసే పరీక్షలతో గుర్తించవచ్చు (Serum creatinine, urine protein/albumin excretion).
మూత్రంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, మూత్ర పరీక్షలో తెలిసే అవకాశం ఉంది.
దీర్ఘ కాలిక జబ్బులు అదుపులో ఉన్నాయా లేదా అని తెలియడానికి, సంబంధిత షుగర్ పరీక్షలు, కొవ్వు పరీక్షలు చేయ వలసి ఉంటుంది.
కడుపు స్కాన్ చేయడం వల్ల, మూత్ర పిండాలు కుంచించుకు పోయి ఉన్నాయా అని, లేక వాటిలోని రాళ్ళను, లేక వాపును, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, దాన్ని గుర్తించే అవకాశం ఉంది.
రక్తం ఉత్పత్తి సరిపడా అవుతుందా లేదా అని రక్త పరీక్ష,; గుండె పని తీరును గుర్తించే గుండె స్కానింగ్, మొదలగు పరీక్షలు అవసరాన్ని బట్టి చేయించ వలసి ఉంటుంది.
*కిడ్నీ ని కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:*
*ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి.
*అధికంగా మాంసం తీసుకోకూడదు.
*ప్రతి రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి
*ఆహారంలో సగం భాగం పీచు పదార్ధాలు ఉండే లాగా చూసుకోవాలి.
*ధూమపానం మానేయాలి
*నొప్పి గోళీలు, అనవసరంగా స్టరోయిడ్స్ వాడకూడదు.
*రక్త పోటు, మధుమేహం ఉన్న వారు తరుచూ పరీక్ష చేసుకుంటూ, సరయిన వైద్యుల వద్ద, మందులు వాడుకోవాలి.
*రక్త హీనత, నీరసం, ఒళ్ళు నొప్పులు, వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల సలహా మీద పరీక్షలు చేయించుకోవాలి.
అయితే, మూత్ర పిండాల సమస్య వల్ల, ఆరోగ్య పరమైన ఇబ్బందులే కాక, ఆర్థిక పరంగా, సహజ వనరుల పరంగా కూడా అనేక సమయాలు దీనితో కూడుకొని ఉన్నాయి. కిడ్నీ సమస్యలను గుర్తించడం ఆలస్యమైతే చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక సారి డయాలిసిస్ కి దాదాపు రెండు వేల రూపాయల చొప్పున, వారానికి మూడు సార్లు, ప్రతి సారి నాలుగు గంటలు, అదీ జీవితాంతం. దానికి డబ్బుతో పాటు, రోగితో పాటు మరొకరు కూడా తమ సమయాన్ని కేటాయించ వలసి ఉంటుంది. ఒక సారి డయాలిసిస్ కి నూటాయాభై లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి. అందుకే ఇలాంటి ఒక సమస్య తీవ్రతను తగ్గించడం, ముందస్తుగా గురించే అవగాహన పెంచడం, తగిన చికిత్స అందించడం చాలా అవసరం. ముఖ్యంగా దీర్ఘ కాలిక జబ్బులతో బాధ పడుతున్న వారు, వైద్యుల సలహా మేరకు, మందులు వాడుతూ, వాటిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం .