01/07/2025
గొప్ప వైద్యుడే కాదు,
దార్శనికుడైన రాజనీతిజ్ఞుడు
డా. బి.సి. రాయ్
అది 1942...క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతోలది. పుణె నగరంలో గాంధీజీ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఔషధాలు స్వీకరించడానికి గాంధీజీ అంగీకరించడంలేదు -- ఆ మందులు భారతదేశంలో తయారుకాలేదని. గాంధీజీ మిత్రుడయిన ఓ రాజకీయ నాయకుడు, వైద్యుడు వైద్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
"నేనెందుకు ఔషధాలు స్వీకరించాలి? నలభై కోట్ల భారతీయులకు ఉచితంగా వైద్యం చేయగలవా?" అని ఆ వైద్యుడిని గాంధీజీ ప్రశ్నిస్తున్నారు. గాంధీజీకి ఎదురయిన సమాధానం ఏమిటో తెలుసా?
"గాంధీజీ మహాశయా... నలభై కోట్లమంది భారతీయులకు ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నలభై కోట్లమంది భారతీయులకు ప్రతిరూపమైన మహాత్ముడికి వైద్యం చేస్తున్నాను" అని ఆ వైద్యుడు జవాబు ఇచ్చాడు. దాంతో గాంధీజీ మెత్తబడి, వైద్యం స్వీకరించాడు. మరి ఎవరా వైద్యుడు ? ఆయన వైద్యుడే కాదు; ఆయన రాజకీయవేత్త, విద్యావేత్త, సంఘసంస్కర్త, మహామనీషి! అతనే డా.బి.సి. రాయ్ గా ప్రఖ్యాతులైన బిధాన్ చంద్రరాయ్.
స్వాతంత్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ కు తొలి ముఖ్యమంత్రిగా సుమారు పద్నాలుగు సంవత్సరాలు సేవలందించి మతకలహాలు, ఆహార కొరత, నిరుద్యోగం, కాందిశీకుల వలసలతో తల్లడిల్లే రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన రాజనీతిజ్ఞుడు. డా|| బి.సి. రాయ్ జన్మదినాన్ని మన దేశంలో 'డాక్టర్స్ డే'గా జరుపుకుంటున్నాం. ఆయన మనదేశపు వైద్య రంగానికి చేసిన సేవ విశేషమైనది, విలక్షణమైనది. మనదేశంలో 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రారంభం కావడానికి ఆయనే ఆధారభూతం. ఆధునిక వైద్యశాస్త్రాన్ని మనదేశంలో మలచిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అతని ఆలోచనే! అంతేకాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ హాస్పిటల్, దేశంలో తొలి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజి (కోల్కత్తా) వంటి సంస్థలు రావడానికి డా.బి.సి. రాయ్ చేసిన దోహదం ఎంతో ఉంది. ఇంకా జాదవ్ పూర్ టి. బి. హాస్పిటల్, కమలా నెహ్రూ హాస్పిటల్, ఆర్. జి.కర్ మెడికల్ కాలేజి వంటి వాటిని స్థాపించారు. ఇంత నేపథ్యం ఉంది కనుకనే ఆయన జయంతి ( అలాగే వర్థంతి కూడా) సందర్భాన్ని 'డాక్టర్స్ డే' అంటున్నాం.
బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న పాట్నా దగ్గర జన్మించారు. తండ్రి ప్రకాశ్ చంద్ర, తల్లి అఘోర్ కామినీ దేవి. ఈ దంపతులకు ఐదుగురు సంతానం వారిలో చివరివాడు మన బి.సి. రాయ్. తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. బి.సి. రాయ్ తన తల్లిదండ్రుల నుంచి క్రమశిక్షణ, దయ, సామాన్య జీవితాన్ని అలవరచు కున్నారు. బంధుమిత్రులనే కాక మిగతావారి పట్ల దయగా, సేవాభావంతో నడుచుకోవాలని ఆ దంపతులే బి.సి. రాయ్ కు అలవాటు చేశారు. తల్లి తన 14వ ఏట గతించారు. తర్వాత తండ్రి ఇరువురి పాత్రలను పోషిస్తూ పిల్లలను పెంచారు.
కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ. చదువు తర్వాత పాట్నా కళాశాలలో మేథమెటిక్స్ ఆనర్సు చేశాడు బి.సి. రాయ్. ఆయన బెంగాల్ ఇంజనీరింగ్ కళాశాల, కలకత్తా మెడికల్ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నాడు. రెండింటిలోనూ అవకాశాలు వచ్చాయి. చివరికి వైద్యం వైపు మనసు ఒరిగింది. వైద్యవిద్య ఒక సంవత్సరం పూర్తవగానే తండ్రి పదవీ విరమణ చేశారు. రాయ్ కు డబ్బులు తండ్రి నుంచి వచ్చేవి కావు. స్కాలర్షిప్ తో గడుపుతూ, మిత్రుల నుంచి పుస్తకాలు అరువు తీసుకుని చదువు సాగించారు. రాయ్ వైద్య విద్య చదువుతున్నప్పుడే బెంగాల్ విభజన ప్రకటించారు. దీనిని లాలా లజపతిరాయ్, అరవింద్ ఘోష్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటివారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమాల వైపు వెళ్ళాలని రాయ్ ఎంతగానో ఉబలాటపడ్డాడు. అయితే వైద్య విద్య పూర్తి చేశాకనే దేశానికి మరింత సేవ చేయగలననే ఆశ ఆ ఉబలాటాన్ని అధిగమించింది.
వైద్య విద్యలో పట్టాపొందిన తర్వాత అప్పటి ప్రభుత్వ సర్వీసులో చేరారు. అవసరమైనపుడు ఆయన సర్ఫ్ కూడా సేవలందించారు. అలాగే తీరిక దొరికినప్పుడు ప్రైవేటుగా కూడా వైద్య సేవలందించారు. 1909లో ఉన్నత విద్య కోసం ఆయన ఇంగ్లాండు వెళ్ళాలని మనసు పడ్డారు. అక్కడ ఇతనికి ప్రవేశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు, సుమారు 30 సార్లు అభ్యర్థించారు. చివరికి అవకాశం లభించింది. రెండు సంవత్సరాల మూడు నెలల్లో ఆయన ఎం. ఆర్. సి. పి.; ఎఫ్. ఆర్. సి. ఎస్. కోర్సులు పూర్తి చేసి 1911 సం. ఫిబ్రవరిలో భారతదేశం తిరిగి వచ్చారు. కలకత్తా మెడికల్ కళాశాలలోనూ, తర్వాత క్యాంప్ బెల్ మెడికల్ కాలేజీ, కార్మికల్ మెడికల్ కాలేజిలలో పనిచేశారు.
భారత ప్రజలు ఆరోగ్యంగా శారీరకంగా, మానసికంగా ఉన్నపుడే స్వరాజ్యం సాధ్యమని స్థిరంగా భావించాడు డా॥ బి.సి. రాయ్. ఈ లక్ష్యంతోనే ఆయన చాలా హాస్పిటళ్ళు ప్రారంభించాడు. విక్టోరియా ఇన్స్టిట్యూషన్ వంటి సంస్థలు మొదలు పెట్టారు. స్త్రీలకు, పిల్లలకు 1926లో చిత్తరంజన్ సేవాసదన్ ప్రారంభించారు. తొలుత స్త్రీలు, పిల్లలు రాలేదు. కానీ తర్వాత తర్వాత వారు ఆ సంస్థను ప్రాణంగా భావించారు. నర్సింగ్, సామాజిక సేవ కోసం మరో కేంద్రాన్ని ప్రారంభించారు. 1942లో రంగూన్ మీద జపాన్ బాంబులు వేసింది. ఆ సమయంలో డా॥ బి.సి. రాయ్ మహాశయుడు కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తో ఉన్నారు. పాఠశాలలకు, కళాశాలలకు ఎయిర్ రెయిన్ షెల్టర్స్ ఏర్పాటు చేసి చదువుకు ఆటంకం లేకుండా చేశారు. ఈ కృషికి 1944లో డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇచ్చి గౌరవించారు.
ఒకవైపు వైద్యరంగంలో సేవ చేస్తూనే 1925లో రాజకీయ రంగంలో ప్రవేశించి స్వతంత్ర అభ్యర్థిగా బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు పోటీచేసి 'బెంగాల్ గ్రాండ్ ఓల్డ్మన్' సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించాడు. కలకత్తా సమీపాన ప్రవహించే హుగ్లీనది లోని కాలుష్యం గురించి అధ్యయనం చేసి పరిష్కారమార్గాల గురించి చట్టసభల్లో 1925లోనే పలు రకాల మార్గాలను ప్రతిపాదించాడు. ఈ విషయం ఒకటి చాలు ఆయన దార్శనికతను పరిశీలించడానికి. 1928లో అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ఎంపికయ్యారు. విభేదాలకూ, వైషమ్యాలకు దూరంగా ఉంటూ పెద్దనాయకుల మనసు చూరగొన్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని విజయవంతంగా నడిపాడు. దీనితో ముచ్చటపడిన మోతీలాల్ నెహ్రూ డా॥ బి.సి. రాయ్ ను వర్కింగ్ కమిటీ సభ్యులుగా చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీని రద్దుచేసి 1930 ఆగస్టు 26న చాలా మందితో పాటు బి.సి. రాయ్ ను కూడా సెంట్రల్ అలీపోర్ జైలులో నిర్బంధించింది.
1931 దండి సత్యాగ్రహం సమయంలో డా|| బి.సి. రాయ్ ను జైలు బయటనే వైద్య సేవలందించాలని ప్రతిపాదించారు. 1931 నుంచి 1933 వరకు కలకత్తా కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే కలకత్తాలో ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యసేవ, మంచి రహదార్లు, వీధి దీపాలు, నీటిసరఫరా వంటి సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి.
స్వాతంత్ర్యం సిద్ధించాక, బెంగాలు వారి బి.సి. రాయ్ ముఖ్యమంత్రి కావాలని గాంధీజీ ప్రతిపాదించారు. నిజానికి ఇది డా. రాయ్ కు ఇష్టంలేదు. గాంధీజీ వ్యక్తిగత వైద్యుడిగా బి.సి. రాయ్ పలు సందర్భాల్లో సేవలు చేశారు. ఉదాహరణకు 1933 పుణె ఒడంబడిక సమయంలో రాయ్ ఇచ్చిన తోడ్పాటు చాలా విశేషమైనది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది అంతకుమించి డా. రాయ్ తత్వం ఏమిటో బాగా ఎరిగి ఉండడంతోనే ముఖ్యమంత్రి కావాలని గాంధీజీ బలంగా ప్రతిపాదించారు. దాంతో గాంధీజీ మాటకు గౌరవం ఇస్తూ 1948 జనవరి 23న డా. బి.సి. రాయ్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు.
పశ్చిమ బెంగాల్ కు సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనందించిన సేవలు ఎంతో గణనీయమైనవి. 1950 దశకం మొదట్లోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కె.ఎస్. కృష్ణన్, పశ్చిమబెంగాల్ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ సంయుక్తంగా సైన్స్ వ్యాప్తికి మ్యూజియమ్స్ నిర్మాణాలు అవసరమని ప్రణాళికలు వేశారు. భారత ప్రభుత్వం 1961లో డాక్టర్ బి. సి. రాయ్ ను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. తర్వాతనే సైన్స్ మ్యూజియమ్స్, పార్కులు, సిటీలు రావడం చరిత్ర.
భారత ప్రభుత్వం 1961లో డాక్టర్ బి. సి. రాయ్ ను భారతరత్న పురస్కారంతో గౌరవించింది. 1962 జూలై 1వ తేదీ ఉదయం కొందరు రోగులను చూసి, తర్వాత తన విధులను నిర్వహించిన పిమ్మట బ్రహ్మసమాజం గీతాలు చదువుకున్నారు. పిమ్మట అకస్మాత్తుగా, సునాయాసంగా 80వ యేట డాక్టర్ బి.సి. రాయ్ మరణించారు.
జీవితాంతం బ్రహ్మచారిగా సాగిన డా॥ బి.సి. రాయ్ మరణానంతరం తన ఇల్లును తన తల్లి పేరున ఆసుపత్రి నడుపుకోవడానికి దానం చేశారు. ఆయన హయాంలోనే దుర్గాపూర్, కళ్యాణి, బిదాననగర్ నగరాలకు పునాదులు పడ్డాయి. 1976లో వైద్యం, రాజకీయాలు, సైన్స్, తత్వం, సాహిత్యం, కళల్లో బి.సి. రాయ్ నేషనల్ అవార్డు ప్రారంభించారు. ఈ సేవలన్నింటికీ గుర్తుగా ఆయన జయంతిని 1991నుంచి మనం డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నాం! సమాజం పట్ల మరింత ఆర్తిని వైద్యులలో ప్రేరేపించి, వారిని మరింతగా దేశనిర్మాణంలో భాగస్వాములుగా చేయాలని ప్రపంచీకరణ మొదలైన సంవత్సరంలో ఇది శ్రీకారం చుట్టుకోవడం మరీ విశేషం!