18/12/2022
సూక్ష్మ శరీర యానము 1
ఓం గం గణపతయే నమః .... జై గురువు దత్త ...... శ్రీ గురుభ్యోనమః .....
ఈ సమయంలో నా గురువులను స్మరించుట నాధర్మము. ఈ సూక్ష్మ శరీర యానము చేసే విద్యను నా గురువుల వద్ద అభ్యసించి, నా స్వంత అనుభవములను పొందుపరుస్తూ వ్రాస్తున్నాను.
ఈ సూక్ష్మ శరీరం అనేది ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. మానవుడు యొక్క స్థూల శరీరంలో పూర్తిగా ఇంకిపోయి దాగివున్న ఇంకొక శరీరము సూక్ష్మ శరీరం.. ఈ సూక్ష్మ శరీరాన్ని మానవుడు యొక్క శరీరం నుండి బయటకు తీసుకురావడం అనేది ఒక పెద్ద ప్రక్రియ.. ప్రతి ఒక్కరికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ సూక్ష్మ శరీరం బయటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కాకుండా ఈ సూక్ష్మ శరీరమును సాధన ద్వారా కూడా బయటికి తీసుకు రావచ్చు. ఒక అనుభవం ఉన్న గురువు ఉంటే అది అసాధ్యం కానే కాదు...
ఈ విద్య గురించి చాలా గ్రంథాలో చాలా రకాలుగా రాశారు. దేవలోకాలకి వెళ్ళవచ్చు అని, మనకి కావాల్సిన ప్రదేశాలలోకి, మరియు మనకి కావలసిన మిత్రుల వద్దకు వెళ్లి చూసి తిరిగి రావచ్చు అని, అంతే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఈ సూక్ష్మ శరీరయానం తో ఉన్నాయి అని చెప్పారు. మన స్థూల శరీరంకు మరియు సూక్ష్మ శరీరంకు మద్య ఒక సిల్వర్ కార్డ్ (వెండి తీగ) ఉంటుంది అని రాశారు. వారి వారి అనుభవాలలో వారు కావలసినంత క్షుణ్ణంగా చెప్పారు. ఈ విద్య గురించి చాలా గ్రంధాలు ఉన్నాయి.
ఈ విద్య గురించి బయటవిషయాలు నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నాకు కలిగిన స్వంత అనుభవాలను మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను.
ఒకరోజు నేను యోగ సాధన ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు నేను నేలమీద పడుకొని ఉన్నాను. పడుకుని నిద్రిస్తున్న అనగా యోగనిద్రలో ఉన్న నాకు నా శరీరమును నేను నిల్చుని చూసుకోగలిగాను. నేను వేసుకున్న బట్టలు, అదే విధముగా నేను ఏ స్థితిలో పడుకుని ఉన్నానో ఆస్తితిని, నేను సాధన చేస్తున్న గదిలోని కొన్ని వస్తువులను, వీటన్నిటికన్నా ముఖ్యంగా నా ముఖము, కళ్ళు మూసుకొని ఉండడం, నా రూపము (అద్దంలో చూసుకున్నట్లు) మరియు నిద్రిస్తున్న నన్ను, నా శరీరం మీద వస్త్రాలు చాలా స్పష్టంగా చూసాను..... చీకటి గదిలో సాధన చేస్తున్న నాకు ఎంతో కాంతివంతమైన గదిగా(సాధారణమైన కాంతి కాదు, ఎండాకాలం మధ్యాహ్నం ఎండ ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతి) కనిపించింది. ఆ గదిలో నన్ను నేను చూసుకో గలిగాను. ఈసాధన నాకు స్వయంగా అనుభూతి కలిగింది. మొదటిసారి ఈ అనుభూతి కలగగానే నాకు ఒక వింత ఆశ్చర్యం కలిగింది, షాక్ కి గురి అయ్యాను. షాక్ కి గురి అయిన మరుక్షణంలో నాకు మెలుకువ వచ్చేసింది. కళ్ళు తెరిచి చూశాను. సామాన్యంగానే చీకటిగానే కనిపించింది. కళ్ళముంద వెలుగులు అలాగే ఉన్నాయి. కానీ శరీరంలో ఒక అలజడి, శరీరం మొత్తం బరువెక్కి నట్లు అనిపించడం, ఆహ్లాదకరమైన ఆనందాన్ని పొందిన అనుభూతి, మరియు ఇంకా చెప్పలేని రాయలేని అనుభూతులు కూడా కలిగాయి.
కానీ ఈ అనుభూతి లో నాకు ఎక్కడ పుస్తకాలలో చదివినట్లు సిల్వర్ కార్డ్ అనగా వెండి తీగ ఉన్నట్లు కనిపించలేదు. అంతేకాదు ఈ సూక్ష్మ శరీర యానము అనుభూతి కలిగిన ఎవరు కూడా వారు ఏ వెండితీగను అనగా సిల్వర్ కార్డు చూసిన ఎక్స్పీరియన్స్ చెప్పలేదు. ఇది కేవలం గ్రంథాలలో చదివినప్పుడు మాత్రమే చూశాను. కనుక వెండి తీగ ఉన్నా లేకపోయినా దాని ప్రభావం ఉంటుంది అని మాత్రం తెలుసుకోగలిగాను.
ఈ సాధనని సాధారణ వ్యక్తులు ఎంతో చక్కగా, సులభంగా సాధన చేయవచ్చు. అసలు ఈ విద్య ఉందా, లేదా... అనే విషయాన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలను మనం గుర్తు తెచ్చుకుని నిర్ధారణ చేసుకుందాం.
ప్రతి మనిషికి తనకు ఈ విషయం అనగా ఏదో ఒక విషయము ఎప్పుడో జరిగిందే, లేదా ఈ వ్యక్తులను ఎప్పుడో చూసాము, కలిసాము లేదా ఎవరో తెలిసిన వ్యక్తి మనకి ఒక వస్తువును ఇదివరకు ఇచ్చిన అనుభూతి కలగడం, ప్రస్తుతం నడుస్తున్న సిచ్యువేషన్ లో ఏదో ఒక సందర్భము, పరిస్థితి గతంలో ఎదురైన అనుభూతి కలగడం.... ఇటువంటివి ప్రతి మనిషికి సహజంగా ఎదురవుతాయి. అర్థం కాకపోతే ఈపేరాని మరలా మరలా చదవండి. ఏదైనా ఒక పనిని ప్రస్తుతం మనం చేస్తున్నప్పుడు ఈపని గతంలో జరిగిన అనుభూతి కలుగుతుంది.
ఉదాహరణకి నాతో ఒక వ్యక్తి పంచుకున్న అనుభూతి... తాను ఒక గ్లాస్ తో నీరుని తన మిత్రుడికి అందిస్తున్నట్లు, అలా అందిస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి వచ్చి తనతో సంభాషించినట్లు, ఆముగ్గురు కలిసినట్లు... అది కూడా వేరే ప్రదేశంలో... ఈ ప్రదేశం అని ఎందుకు అన్నాడు అంటే వారు అందరూ కలిసి మొదటిసారిగా ఆ ప్రదేశానికి వెళ్లారు. అందుకే ఒక ప్రదేశాన్ని తాను స్పష్టంగా తెలియజేయగలిగాడు. కానీ ఆ వ్యక్తికి ఆ యొక్క సందర్భం ఎదురు అవగానే ఈ విషయం ఆల్రెడీ ఇది వరకు జరిగినట్లు అనిపించింది. అని వింతగా, ఆశ్చర్యంతో చెబుతూ నాతో పంచుకున్నాడు. ఇదే విధముగా ఇంకో మిత్రుడు కూడా నాతో తన అనుభవాన్ని అనగా ఆల్రెడీ ఇది వరకు జరిగిన విషయాన్ని మరలా తనకి జరిగినట్లు గుర్తుకురావడం.... పంచుకున్నాడు, తన యొక్క అనుభూతులను..... ఎందుకు ఇలా జరుగింది అని అడిగారు. వాస్తవానికి ఇటువంటి అనుభూతులు నాకు కూడా చాలా ఎదురయ్యాయి. ఈ విషయం కొంత మందికి అర్థం అయి ఉండవచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండవచ్చు.
ప్రతి మనిషి చిన్నతనంనుంచి నిద్రిస్తూ ఉన్నప్పుడు కలలు రావడం సహజం. కానీ శరీరం గాఢనిద్రలోకి జారుకున్నడు స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి కాలంలో ప్రయాణిస్తుంది, అనగా భవిష్యత్తులోకి వెళ్లి రావడం గడిచిన కాలంలో కి వెళ్లి రావడం, అంతేకాకుండా గత జన్మలలోనికి కూడా వెళ్లి వస్తుంది. కానీ అన్ని విషయాలు స్థూల శరీరానికి గుర్తు ఉండవు. కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటాయి. ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు మాత్రమే స్థూల శరీరమునకు ఆయా విషయములు గుర్తు వస్తుంది. ఈ విషయాలని ఎవరు నమ్మినా, నమ్మక పోయినా సహజంగా జరిగిన అనుభూతిని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే నాకు ఇటువంటి వింత అనుభవాలు కలిగినప్పుడు, నాకు మాత్రమే ఇలా జరిగిందా లేదా అందరికీ ఇలాగే జరిగిందా అనే అనుమానంతో నేను సుమారు ఒక వంద మందిని ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు సుమారు 95 మంది నిజం అని ఒప్పుకున్నారు. మాకు కూడా ఇలా జరిగింది అని, కానీ మిగిలిన వారు ఎవరు నాకు అటువంటి అనుభూతి కలగలేదు అని చెప్పారు. ఇక్కడ మిగిలిన వారు ఎందుకు నిజం ఒప్పుకోలేదు అన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ ఆ విషయాన్ని ప్రస్తావించధలుకోలేదు.
అంతేకాకుండా ప్రతి మనిషికి కలలో కొంత అలజడి ఎదురవుతూ ఉంటుంది, కొండల మీద నుంచి పడిపోతున్న అనుభూతి, గుండెల్లో తెలియని అలజడి, మనం నిద్రిస్తున్నప్పుడు మనం నిద్రిస్తున్న గదిలోనే మనకు తెలియకుండా తిరుగుతూ ఉన్న అనుభూతి, అది అంతా ఒక భయంకరమైన కలగా.... ఇంకా చాలా చాలాలా వింత అనుభవాలు.... ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు నిద్ర నుంచి లేచిన తర్వాత కొంత ఆందోళన చెందిన అనుభూతిని మనం పొందే ఉంటాము. ఇదే విధముగా కొంతమంది ధ్యానం చేసే వ్యక్తులు వారు తెలియని లోకాలకు వెళ్ళి దర్శనం చేసుకుని రావడం వంటి అనుభవాలను వారు స్వతహాగా నాతో పంచుకున్నారు.
ఆధ్యాత్మిక విద్యలలో ఏ విషయం అయినా సరే మనం సైన్స్తో పోల్చుకోగలము. లాజికల్ గా సరిపోతుంది. కానీ ఒక్క సూక్ష్మ శరీర యానం విద్యను మాత్రం సైన్స్తో పోల్చుకో లేము. ఎందుకు అంటే జరిగిన దానిని మనిషి మరల జరిగినప్పుడు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. ఈ విషయాన్ని సైన్స్తో పోల్చడానికి ఎక్కడ సరిపోవట్లేదు.
సూక్ష్మ లోకాల విషయానికి వస్తే మాత్రం ఈ విషయం మొత్తం మనం ముందే అనగా చిన్నతనం నుంచి మనం ఊహించుకున్న ఊహలు అయివుండవచ్చు... యోగ నిద్ర లేదా డీప్ గా ధ్యానం చేసినప్పుడు, ట్రాన్స్ లో కి వెళ్ళినప్పుడు మనకు ఇటువంటి అనుభూతులు రూపం దాల్చి కొత్తలోకంగా దృశ్య అనుభూతిని కలిగించచ్చు. ఈ విషయాన్ని సైన్స్ తో పోల్చవచ్చు. ఇదంతా సైన్స్ యొక్క ఊహాగానమే...
వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో లోకాలు ఉన్నాయి, అనే విషయాన్ని మాత్రం సైన్స్తో పోల్చకుండా సుస్పష్టంగా నమ్మవచ్చు. ఎందుకు అంటే నన్ను నేను చూసుకున్న రోజు నుంచి నేను సూక్ష్మ శరీర యానం విద్య ఉన్నది అని, ఎవరైనా ఈ విద్యను చేయవచ్చు అని, సుస్పష్టంగా నమ్మాను. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నాఆత్మసాక్షి. నా భ్రమ కాదు. ఈ విద్యను నేను నమ్ముతాను, మిగిలినవారు నమ్మవలసిన అవసరం నాకు ఎంత మాత్రమూ లేదు.
ఈ విద్యలో మహా సిద్ధి పొందిన వ్యక్తులు ఏమి చెబుతున్నారు అంటే, అష్ట సిద్ధులను స్థూల శరీరంతో చేయడం కన్నా సూక్ష్మ శరీరంతో చాలా తేలికగా చేస్తారు అని, సూక్ష్మశరీరము కావలసినంత పెద్దదిగా లేదా కావలసినంత చిన్నదిగా మార్చవచ్చని, అదేవిధంగా క్షణకాలంలో ఏ ప్రదేశానికి అయినా ప్రయాణం చేయవచ్చు అని, అదే విధముగా పరకాయ ప్రవేశ విద్య కూడా ప్రదర్శించవచ్చు అని, వశీకరణ విద్య సిద్ధిస్తుంది అని గ్రంథాలలో రాశారు. అంతేకాకుండా అనుభవం పొందిన వ్యక్తులు కూడా తెలియజేస్తున్నారు..
నేను ఇప్పటివరకు రాసిన వ్యాసాలలో ఏ విద్య యొక్క సాధన విధానాన్ని మాత్రం రాయలేదు. ఎందుకు అంటే ఆ సాధన విధానాలు అన్ని గురుముఖంగా నేర్చుకోవాలని.... మాత్రమే పతంజలి యోగ సూత్రాలలో చాలా స్పష్టంగా తెలియజేశారు.
ఈ విషయాన్ని మాత్రం ఎవరైనా సరే సాధన చేయవచ్చు. ఈ సాధన విధానం లో సాధకుడికి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారవు, కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదురవుతాయి.ఈ సాధన చేసే వ్యక్తులకు మాత్రం ప్రారంభంలో నిద్ర ఎక్కువగా, గాఢంగా రావచ్చు. లేదా నిద్రపట్టని పరిస్థితులు కూడా కలగవచ్చు. కొన్ని సందర్భాలలో రాత్రి మొత్తం నిద్ర పట్టదు. ఈ సాధనలో నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే సాధనను పూర్తిగా ఎరుకతో అనగా సాధకుడు సాక్షిగా చూస్తూ, మానసిక భావన కలుగజేస్తూ ఎరుకతో సాధించాలి. ఇలా సాధన చేస్తున్న సందర్భంలో శరీరం తుళ్ళి పడుతుంది. ఒక్కొక్కసారి శరీరం మంచం మీద నుంచి ఎగిరెగిరి పడుతుంది. చాలా భయానకంగా అనిపిస్తుంది... ఇలా అనిపించినప్పుడు కొద్ది రోజులు సాధన ఆపి మరలా చేసుకోవచ్చు... ఈ విద్య ని ఏ వ్యక్తి అయినా సరే చాలా సులభంగా సాధన చేసుకోవచ్చు. యోగ విద్యలు చేసే వ్యక్తులకు ఈ విద్య చాలా సులభంగా సిద్ధిస్తుంది.
ఈసాధన మరి అంత కష్టమైనది కాదు, మనం అనుకున్నంత సులువుగా ఉండదు. ఈసాధన సిద్ధించడానికి కొంతమందికి కొన్ని రోజులలో, కొన్ని నెలల్లో ఇంకొంతమందికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. యోగ విద్యను సాధన చేస్తున్న వ్యక్తులకు మాత్రం ఈవిద్య చాలా సులువుగా లభిస్తుంది.
మానసిక విద్యలు సాధించే టప్పుడు సాధకుడు ఎక్కువ సహనము, ఓర్పు, భక్తి, శ్రద్ధ, అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రశాంతతని తనలో నింపుకుని, ఆ విద్య యొక్క అధిష్టాన దేవతకు తనని తాను అర్పించు కోవాలి. పతంజలి అష్టాంగ యోగం లో ఈశ్వర ప్రణిదానము అని వివరించినది ఈ యొక్క సమర్పణ భావము గురించే. కనుక సాధకుడు ఏ విద్య అయినా సరే ఓర్పుతో సాధన చేస్తే ఆ విద్య సిద్ధిస్తుంది. కానీ ఎప్పటికి సిద్ధిస్తుంది అనే విషయాన్ని, సమయము ఎవ్వరూ అనగా గురువు కూడా చెప్పలేరు. ఎందుకు అంటే ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తికి ఉన్న బాధ్యతలు, మరియు ఇతరత్రా వ్యవహారాలు.
ముఖ్య గమనిక ఏమిటి అంటే ఈ సాధన చేస్తున్న వ్యక్తులలో ఎవరికైనా సరే నిద్రలేమి వ్యాధి వస్తే అనగా అసలు నిద్ర పట్టక పోవడం అనే వ్యాధి వస్తే కొద్ది రోజులు మాత్రం ఈ సాధన ఆపివేయడం మంచిది. ఎందుకు అంటే మరలా తెల్లవారిన తర్వాత నుంచి మన వ్యవహారాలు చూసుకోవాలి, శరీరంకు నీరసం వస్తుంది. అదే విధముగా రోగగ్రస్తం కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కొద్ది రోజులు సాధనని ఆపడం చాలా మంచిది. నిద్రలేమి వచ్చిన వారు మాత్రమే ఈ సాధనని ఆపవచ్చు, మిగిలినవారు యధావిధిగా సాధన చేసుకోవచ్చు.
సూక్ష్మ శరీర యానము సాధన చేస్తున్న వ్యక్తులకు పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు, మానసిక ప్రశాంతత పొందే విధానము మరియు ఇంకా పూర్తి సూక్ష్మ శరీర సాధన విధానము తరువాత వచ్చే వ్యాసంలో పొందు పరుస్తాను.
ఈ వ్యాసం మొత్తం నా సొంత అనుభవంతో, నాగురువుల వద్ద నేను నేర్చుకుని నేను పొందిన అనుభూతులను పొందుపరుస్తూ, సాధనలో నాకు వచ్చిన ఇబ్బందులను మరియు కలిగిన స్థితులను తెలియజేస్తూ రాస్తున్నాను. ఎక్కడా గ్రంథాల నుండి సేకరించి రాసినది కాదు. ఇది అంతా నా సొంత అనుభవం.
నేను గతవ్యాసము వశీకరణ విద్య గురించి నాస్వంత అనుభవాలు, స్వంత మాటలలో వ్రాసినప్పుడు ఎవరో పాటకుడు వ్యాకరణం లేదు, సాహిత్యం లేదు... ఇంకా ఏవేవో గ్రామర్ పదాలు లేవు అని కామెంట్ లో పెట్టారు. నేను పండితుడను కాదు. నా సొంత మాటలలో సొంత అనుభవాలలో గుర్తుపెట్టుకుని పదాలలోకి రాస్తున్నప్పుడు భాషా పరిజ్ఞానం ఈ విధంగానే ఉంటుంది.
తప్పులుంటే, తప్పుగా అనిపిస్తే క్షమించండి.
మనకు ఈ వ్యాసాలు అన్నింటికి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉన్నది.
ఈ వ్యాసంలో నేను గత సంవత్సరం 2021 వ సంవత్సరంలో రాసి వేరే పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2012 డిసెంబర్ నెల వరకు చాలా చాలా అనుభవాలు కూడా వచ్చాయి. అవి ఇంకొక పోస్టులో పోస్ట్ చేస్తాను
ధన్యవాదాలు
టెలిగ్రామ్ లో మీరు Search Box లో SpiritualPaths అని type చేస్తే ఆథ్యాత్మిక సాధనలు - ప్రయోగాలు - తంత్ర మార్గము - మంత్ర ఫలితము అనే ఛానల్ వస్తుంది ఈ ఛానల్ లో గత వ్యాసాలు మొత్తం పొందుపరిచాను.
ఈ వ్యాసం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సందేహాలు ఉన్నా, నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సరి చేసుకుంటాను.