
14/11/2024
"నాకు షుగర్ వచ్చింది. ఏం మందులు వాడుకోవాలో చెప్పండి.!?"
"షుగర్ ఉంది అని చెప్పారు. ఇప్పటి వరకు మందులు start చేయలేదు. ఏం వాడుకోవాలి?"
"షుగర్ కి మరొక doctor దగ్గర మందులు వాడుతున్నాం. కానీ తగ్గడం లేదు. ఇక అవన్నీ మానేస్తాం. ఏం వాడుకోవాలో మీరే చెప్పండి."
"ఏవో షుగర్ మందులు వాడుతున్నాం. ఇప్పుడు ఇంకా కొంచం ఎక్కువే ఉంది. ఇప్పుడు ఏం వాడాలో చెప్పండి."
ఇలాంటి ప్రశ్నలు తరుచూ వింటుంటాం. షుగర్ వ్యాధికి ఇది చికిత్స అని కచ్చితంగా చెప్పడం ఎవరి వల్ల కాదు. షుగర్ తగ్గించే మందులు అనేక రకాలు ఉంటాయి. ప్రతి దానితో కొన్ని లాభాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కో మందు ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రభావం చూపించవచ్చు. షుగర్ రకాన్ని బట్టి, తీవ్రతను బట్టే కాక, ఆ రోగి బరువును, ఇతర సమస్యలను బట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మందు మెరుగైందిగా మేము భావిస్తాము.
అందుకే ఎప్పుడైనా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని, తగిన మందులు రాసి, మళ్ళీ కొద్ది రోజుల్లో పరీక్ష చేసుకొని రమ్మని సూచిస్తాము. ఆ report ని బట్టి, మందుల dose సరిపోతున్నదీ, లేనిదీ తెలుస్తుంది. ముందు ఏవైనా మందులు వాడుతుంటే, అవి ఏంటో తెలియకుండా కొత్తగా రాయడం ఎలా సాధ్యపడుతుంది.!? అవి తెలిస్తేనే కదా, వాటిని పెంచి రాయగలిగేది..!
ఒక మనిషి ఒంట్లో షుగర్ అనేది అనేక కారణాల వల్ల ప్రతి నిమిషం మారుతూనే ఉంటుంది. కానీ, సాధారణంగా ఆ వ్యక్తి pancreas పని తీరు వల్ల, అది ఎప్పుడు నియంత్రణలో ఉంటుంది. ఏదైనా కారణం వల్ల, అది normal range దాటి అధికం అయితే, దాని దుష్ప్రభావం ప్రతి ఒక్క అవయవం మీద ఉంటుంది. ముఖ్యంగా, మూత్ర పిండాలు, రక్త నాళాలు, కళ్ళు, నరాలు, గుండె, మొదలగునవి. అయితే ఈ ప్రభావం ఒకే సారి కనిపించదు. మెల్లిమెల్లిగా ఆ నష్టం అంతా కలిసి ఒక్క సారిగా అత్యవసర పరిస్థితిలో బయట పడవచ్చు.
అందుకే మన షుగర్ కంట్రోల్ చేసుకోవడం, monitor చేయడం కూడా, మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.
"షుగర్ ఉంది, మందులు వాడుతున్నా, కానీ ఈ మధ్య టెస్ట్ చేసుకోలేదు."
"ఆ డాక్టర్ చెప్పిన మందులే వాడుతున్నా, మళ్ళీ చూపించుకోలేదు."
"డాక్టర్ కలవలేదు కాబట్టి మందులు మానేసాను."
"షుగర్ తగ్గింది కాబట్టి మానేసాను."
ఇలాంటి కారణాలతో, చికిత్స నిర్లక్ష్యం చేస్తే, నష్టపోయేది మీరు. ఇబ్బంది పడేది మీ కుటుంబ సభ్యులు.
ఎలా నియంత్రించుకుంటారో మీ ఇష్టం. ఆహార వ్యవహారాలలో మార్పుతో అయినా సరే, లేదా మందులతో అయినా సరే. BP, Sugar control లో ఉండాలి. అంతే..!!
Your health is your responsibility
World Diabetes day.